Jan 2, 2023, 10:52 AM IST
గుంటూరు : మొన్న కందుకూరు, నేడు గుంటూరు... టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వరుస సభలు అమాయకులు ప్రాణాలను బలితీసుకున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిదిమంది మృతిచెందిన దుర్ఘటన మరువకముందే గుంటూరు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా నిరుపేదలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఉయ్యూరు పౌండేషన్ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఆదివారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొంతమందికి జనతా వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ చేసి చంద్రబాబు అక్కడినుండి వెళ్లిపోయాక ప్రమాదం చోటుచేసుకుంది. బట్టలు, నిత్యావసరాలు ఎక్కడ అందవోనని ఒక్కసారిగా జనాలు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందగా మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. తొక్కిసలాట తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. కొందరు మహిళలు స్పృహతప్పి, మరికొందరు గాయాలతో పడివుండటం కనిపించింది. కొందరు మహిళలు గాయపడిన తమవారిని భుజాలపై మోస్తూ తీసుకెళ్లడం కనిపించింది. వెంటనే గాయపడిన వారిని ప్రథమచికిత్స అందించి అంబెలెన్సుల్లో దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు.