ఇదీ గిరిజనుల దుస్థితి... ప్రమాదకర ప్రవాహంలో నిండు గర్భిణిని ఎలా దాటిస్తున్నారో చూడండి

Jul 23, 2021, 1:52 PM IST

సాధారణ సమయంలోనే విశాఖ ఏజెన్సి ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం కోసం కిలోమీటర్ల దూరం కాలినడకన పయనించాల్సి వుంటుంది. అలాంటిది భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సమయంలో కాలినడకన వెళ్లడమూ కష్టమే. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఏజెన్సి ప్రాంతాలను దారులు మూసుకుపోతాయి. ఇలాంటి సమయంలో ఓ గర్భిణి మహిళను హాస్పిటల్ కు తరలించడానికి అష్టకష్టాలు పడ్డ ఘటన విశాఖ ఏజెన్సిలో  చోటుచేసుకుంది.  చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మహిళకు నెలలు నిండిపోయాయి. గర్బిణీని కోరుకొండ పీహెచ్‌సీకి తరలించేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలుపడ్డారు.వర్షంలో అడవి మార్గం గుండా డోలీని మోసి మత్స్యగడ్డ పాయ వరకు చేర్చగలిగారు. అక్కడి నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో గ్రామస్తులకు ఎటూ పాలుపోలేదు. దీంతో ఎండిన చెట్టును ఆధారంగా చేసుకుని మత్స్యగడ్డను దాటడం జరిగింది. వాగు దాటిన తర్వాత మెడికల్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.