చంద్రబాబును చూసి భయపడే... కందుకూరు, గుంటూరులో జగన్ కుట్రలు : నిమ్మల సంచలనం

Jan 3, 2023, 2:00 PM IST

గుంటూరు : రోడ్లపై సభలు, సమావేశాల నిర్వహణకు వైసిపి ప్రభుత్వం ఆంక్షలు విధించడం చూస్తుంటే చంద్రబాబును చూసి సీఎం జగన్ భయపడుతున్నాడని అర్థమవుతోందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దీంతో టిడిపికి చెడ్డపేరు తేవాలనే వైసిపి ప్రభుత్వం కుట్రలు పన్ని కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు కారణమయ్యారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టడం.... ఆయన సభలు, రోడ్ షో లకు జనాలు పోటెత్తుతున్నారని అన్నారు. మరోవైపు జగన్ ఎక్కడికెళ్లినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని అన్నారు. ఇక జగన్ పని అయిపోయిందనే మాటలు తరచూ వినిపిస్తూ ఉండడంతోనే ఇటువంటి ఆంక్షలు విధించారని నిమ్మల అన్నారు.

 సభలు, రోడ్ షో లను నిషేధిస్తూ జారీచేసిన జీవోలు, 30 యాక్ట్ లు  ప్రతిపక్షానికే  వర్తిస్తాయి... అధికార పక్షానికి వర్తించవంటూ నిమ్మల ఎద్దేవా చేసారు. రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు రోడ్ షో ఎలా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా  లక్షలాదిమందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతామని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు.