ఇదీ మా పరిస్థితి... న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే..: అంధ అక్కాచెల్లెళ్ల ఆవేదన

Apr 22, 2021, 5:19 PM IST

విజయవాడ: తమ ఇంటికి వెళ్లే దారిని అక్రమంగా కబ్జా చేశారంటూ ఇద్దరు అందులైన అక్కాచెల్లెల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరు గ్రామంలో తమ ఇంటికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకున్నారని పుప్పాల కృష్ణవేణి, పుప్పాల విజయభారతి ఆరోపిస్తున్నారు. రహదారి నుండి తమ ఇంటికి వెళ్లే దారి గతంలో 6 అడుగుల వెడల్పు ఉండగా కబ్జా కారణంగా 2.5 అడుగులు మాత్రమే ఉందని బాధితులు తెలిపారు. తమలో ఎవరైనా మరణిస్తే కనీసం శవం తీసుకెళ్లటానికి కూడా అవకాశం లేకుండా ఉందని అంధులైన అక్కచెల్లెలు వాపోతున్నారు. కామన్ దారిని ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేస్తున్న వారి పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ హక్కులను రక్షించాలని వారు కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు దీనంగా వాపోయారు. 

ఆరు పదుల వయసు దాటి కాటికి కాలు చాపి రోగాలతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న సమయంలో ఈ సమస్య మరింత బాధిస్తోందని, కనీసం మనస్ఫూర్తిగా భోజనం కూడా చేయలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. తమ మనోవేదనను అధికారులు అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని బాధిత అక్కాచెల్లెల్లు పేర్కొన్నారు.