Jun 21, 2022, 10:46 AM IST
అమరావతి : ఇవాళ (జూన్ 21 మంగళవారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్, హైకోర్టు ప్రాంగణంలో ప్రత్యేకంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలోని రాజ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ పాల్గొని యోగాసనాలు వేసారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రాజ్ భవన్ అధికారులు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం నేలపాడులోని ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మైసూరు పాలెస్ నుండి ఇచ్చిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం యోగా మాస్టర్ సూచనలను అనుసరిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామిరెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రామారావు, హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.హరనాధ్ రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు మరియు హై కోర్టు సిబ్బంది యోగాసానాలు వేసారు.