AP Rains : ఏపీలో మళ్లీ హైఅలర్డ్... విజయవాడలో భారీ వర్షాలు

Jul 22, 2022, 2:00 PM IST

విజయవాడ : గతవారం తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికీ నదులు, జలాశయాలు వరదనీటితో ప్రమాదకరంగా వున్నాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా నదుల్లో వరదనీటి ఉదృతి ఇంకా తగ్గనేలేదు... మళ్లీ తెలుగురాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ (శుక్రవారం) ఉదయం నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయం అయ్యాయి. దీంతో స్కూళ్ళకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజా వర్షాలతో మళ్లీ వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.  ఉత్తరకోస్తాలో వర్షతీవ్రత ఎక్కువగా వుండే అవకాశం వుందని తెలిపారు.