Jan 4, 2023, 2:14 PM IST
చిత్తూరు : మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల తర్వాత రోడ్లపై సభలు, సమావేశాలు. రోడ్ షో లను ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం తర్వాత మొదటిసారి చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఆయన రోడ్ షో, సభలు నిర్వహించకుండా ముందుగానే ఆంక్షలు విధించిన పోలీసులు ప్రచార రథం, సౌండ్ సిస్టం వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక చంద్రబాబు పర్యటించనున్న శాంతిపురం మండలంలో భారీగా పోలీసులు మొహరించారు.
ఇక కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజిని కూడా పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటించే ప్రతి గ్రామంలో, ప్రధాన కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసులు, అదనపు బలగాలను మోహరించారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కుప్పం పర్యటన ప్రారంభంకానుండగా అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా కనిపిస్తోంది.