Jan 27, 2022, 3:00 PM IST
విజయవాడ: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టిడిపి నిజనిర్దారణ కమిటీ గురువారం కలిసింది. కెసినో గురించి ప్రచారం కోసం వాడిన కరపత్రాలు, ఇతర ఆధారాలను టిడిపి బృందం గవర్నర్ కు సమర్పించింది. ఈ క్యాసినో వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని గవర్నర్ కు తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా తదితరులు ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తూ గోవా కల్చర్ ను ఇక్కడి యువతకు అలవాటు చేసేలా వ్యవహరించిన మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వాస్తవాలను పరిశీలించేందుకు వెళ్లిన తమ బృందంపై పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. జరిగిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలంటూ గురువారం తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ కు ఒక వినతి పత్రం సమర్పించారు.