రెప్పపాటులో మాయచేసి... ఉంగరాల బాక్స్ తో ఉడాయించిన ఘరానా దొంగలు...

Sep 8, 2023, 1:35 PM IST

అవనిగడ్డ : బంగారు ఉంగరం కొనడానికంటూ కస్టమర్ లా జ్యుయలరీ షాప్ కు వెళ్లాడో ఘరానా దొంగ. షాప్ లోని వారిని మాటల్లో పెట్టి రెప్పపాటులో ఉంగరాల బాక్స్ తో ఉడాయించాడు. ఇలా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో గురువారం రాత్రి జరిగిన దొంగతనం తీవ్ర కలకలం సృష్టించింది. 

కృష్ణా జిల్లా చల్లపల్లిలో యుగంధర్ అనే స్వర్ణకారుడు స్వాతి జ్యుయలరీస్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఈ జ్యుయలరీలో బంగారం కొనడానికంటూ ఓ వ్యక్తి వచ్చాడు. అతడికి ఉంగరాలు చూపిస్తుండగా సెలెక్ట్ చేసుకుంటున్నట్లు నటించాడు. అదును చూసుకుని ఒక్కసారి బంగారు ఉంగరాల బాక్స్ ను తీసుకుని జ్యుయలరీ బయటకు పరుగుతీసాడు. అప్పటికే బయట బైక్ తో మరొకడు సిద్దంగా వుండగా ఇద్దరూ కలిసి పరారయినట్లు జ్యుయలరీ యజమాని యుగంధర్ తెలిపారు. దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపాడు. జ్యుయలరీ యజమాని ఫిర్యాదుతో పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.