May 11, 2022, 2:17 PM IST
మచిలీపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుపాను ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ తుపాను కారణంగా మండువేసవిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం సముద్ర తీరంలో అత్యంత భయంకరంగా నల్లటి మేఘాలు కమ్ముకోవడం తుపాను తీవ్రతను తెలియజేస్తోంది. ఇక ఇప్పటికే తుఫాను (Cyclone Asani) తీరాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, బాపట్ల మధ్య తీరాన్ని తాకి, కాకినాడ, విశాఖపట్నం వైపు దిశను మార్చుకున్నది. ఈ తుపాను ప్రభావంతో కురిసన వర్షాలకు మచిలీపట్నంలో పంటపొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో సముద్ర అలలు ఎగిసిపడుతుండటంతో తీరంవెంబడి కట్ట కోతకు గురయ్యింది. దీంతో సముద్ర జలాలు దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు చేరి మునకకు గురయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.