సీఎం జగన్ హెడ్ క్లర్క్ గా ఏపీ గవర్నర్... బ్రోకర్ గా కూడా..: సిపిఐ నారాయణ సంచలనం

Mar 8, 2022, 2:20 PM IST

అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏపీలో గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష టిడిపి నాయకులు బహిష్కరించడం... తెలంగాణలో అసలు గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడం రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే సిపిఐ నాయకులు నారాయణ గవర్నర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.అనుభవంతో కూడిన వ్యక్తులు గవర్నర్ గా వస్తే ఆ పదవికి గౌరవం చేకూరుతుందని నారాయణ పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని పేర్కొన్నారు. ఇక ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ముఖ్యమంత్రి జగన్ కి హెడ్ క్లర్క్ గా మారారని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్యచాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి వాటినే సమర్ధిస్తున్నారని నారాయణ ఆరోపించారు.