విజయవాడ ఉద్రిక్తత... టిడిపి మహిళా అభ్యర్థిపై దాడి, కొడుకుపై కత్తితో...

Feb 17, 2021, 9:53 AM IST

విజయవాడ: కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 3వ డివిజన్ టీడీపీ మహిళా అభ్యర్థి వాణిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. సన్నిహితులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలే తనపై దాడి చేశారని బాధితురాలు వాణి ఆరోపిస్తున్నారు. పది మందితో కూడిన గ్యాంగ్ తమపై దాడికి దిగారని... ప్రచారానికి ఉపయోగిస్తున్న ఆటో అద్దాలను పగులగొట్టారని అన్నారు. అడ్డు వచ్చిన తనపైనా, కొడుకుపైనా దాడి చేశారన్నారు. రేపు ఎవరైనా ప్రచారంలో కనిపిస్తే దొడ్లోకి ఈడ్చుకెళ్లి తంతాం అని బెదిరించారు. కత్తితో అబ్బాయిని పొడవబోతే స్థానికులు అడ్డుకున్నారన్నారు.

ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. టిడిపి మహిళా అభ్యర్థి వాణిపై వైసిపి గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్, అతని అనుచరులు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీలో మహిళా సాధికారత దుస్థితి ఇదీ అని మండిపడ్డారు.