Jan 18, 2022, 4:08 PM IST
అమరావతి: వైసిపి ప్రభుత్వం నియమించిన ఆఫీసర్స్ కమిటీని మొదటి నుంచి తాము వ్యతిరేకించామని... కానీ ఫిట్ మెంట్ తక్కువైనా మిగిలిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించామని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో రాజీ పడడానికి సిద్దమే... కానీ ప్రతి అంశంలోనూ రాజీపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలా చేస్తే చరిత్ర మమ్మల్ని క్షమించదని వెంకట్రామిరెడ్డి అన్నారు. హెచ్చార్ఏను తగ్గించడాన్ని... ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ జీవోలపై మిగతా ఉద్యోగ సంఘాలతో చర్చించుకుని ఉమ్మడి వేదిక మీదకు వచ్చి పోరాడేందుకు సిద్దంగా వున్నామన్నారు. ఈ సాయంత్రం సీఎం అపాయింట్ మెంట్ కోరుతున్నామని... ఆయనను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతామన్నారు. రేపు లేదా ఎల్లుండి నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.