మద్యం మత్తులో తాళికట్టేందుకు వచ్చిన వరుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు

By Rajesh Karampoori  |  First Published Apr 30, 2024, 9:41 PM IST

పెండ్లంటనే సందడి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి వేడుక ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ఇక స్నేహితుల సందడి మామూలుగా ఉండదు. కొన్ని పెళ్లిళ్లలో మద్యం మామూలే.. ఆ మద్యమే పెళ్లికొడుకు కొంపముంచింది.. ఫలితంగా ఏకంగా పెళ్లే ఆగిపోయింది.  


సాధారణంగా పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుంది. పెళ్లి మండపం, బంధువులు, బ్యాండ్ బాజాలు, డీజే పాటలు అంతా హడావిడి. ఆడ పిల్ల తల్లిదండ్రులు వరుడికి కట్నం రూపంలో ఇచ్చే దాని కంటే ఈ ఏర్పాట్లకే డబ్బులు అధికంగా ఖర్చు అవుతుంటాయి. అలాంటిది చివరి క్షణంలో పెళ్లి ఆగిపోతే ఆ వధువు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది. పైగా కూతురు మెడలో తాళి కట్టాల్సిన వరుడే.. మద్యం ఫుల్లుగా తాగి పెళ్లి మండపానికి లేటుగా వస్తే ఇగ వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అయితే ఈ పరిస్థితిని వధువు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంది. ఆ వరుడికి జీవితంలో గుర్తుండిపోయే పని చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. 

అది బీహార్ లోని కతిహార్ జిల్లా కుర్సెలా గ్రామం. ఆ గ్రామానికి చెందిన మనీషా కుమారి అనే యువతికి భగల్ పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ కు చెందిన మంజిత్ చౌదరి అనే వ్యక్తికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వధువు తల్లిదండ్రులు పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపం వద్ద భారీగా అలంకరణ చేశారు. అయితే ఆ కల్యాణ మండపం వద్దకు వచ్చి వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు మాత్రం ఫుల్లుగా మద్యం సేవించాడు. 

Latest Videos

అయితే ఆ పెళ్లి కొడుకు కోసం వధువు, ఆమె తరఫు బంధువులు అందరూ ఎదురు చూశారు. అలా చూస్తూ చూస్తూనే అర్థరాత్రి దాటిపోయింది. అయినా ఆ పెళ్లికొడుకు మండపం వద్దకు రాలేదు. దీంతో ఆగ్రహించిన వధువు మనీషా కుమారి కుటుంబ సభ్యులు మంజిత్ కోసం వెతకగా రోడ్డుపై కారులో అపస్మారక స్థితిలో కనిపించాడు. పెళ్లికొడుకు పరిస్థితిని చూసిన మనీషా పెళ్లికి నిరాకరించింది. అతడిని పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. 

దీంతో ఆగక తన పెళ్లి కోసం తల్లిదండ్రులు రూ.4 లక్షలు ఖర్చు చేశారని, దానిని తిరిగి ఇవ్వాలని వరుడితో, అతడి తరుఫు బంధువులతో డిమాండ్ చేసింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు మంజిత్ ను, అతడి తల్లిదండ్రులను బందీలుగా ఉంచింది. దీందో వరుడి తరుఫు బంధువులు వెళ్లి రూ.4 లక్షలను తీసుకొచ్చి ఇచ్చారు. తరువాతే వారందరినీ వదిలిపెట్టింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు మాత్రం అందలేదు. 

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. వధువు చాలా ధైర్యం ప్రదర్శించిందని, వరుడికి సరైన బుద్ది చెప్పిందని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. వరుడి, అతడు తల్లిదండ్రులు బంధీలుగా ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ వధువు చేసిన పనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

click me!