Covishield: మరోసారిగా కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ వార్తల్లో నిలిచింది. ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ అంగీకరించడమే దానికి కారణం. దీంతో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.
Covishield: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే నెలలో దేశంలోకి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 2020 ఏప్రిల్ లో కోవిడ్ -19 ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. అలాంటి సమయంలోనే ఆ మహమ్మారిని నివారించేందుకు వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. చివరికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి ‘కోవిషీల్డ్’ ను అనే కోవిడ్ -19 వ్యాక్సిన్ ను తయారు చేశాయి. దానిని 2021 జనవరి 1వ తేదీన భారత్ లో అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇచ్చింది.
దీంతో ఆ వ్యాక్సిన్ ను భారత్ లో వినియోగించడం ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ ను పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. కొంత కాలం తరువాత రెండో డోస్ కూడా అందించారు. అయితే తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అంతా బాగానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారందరినీ అయోమయంలో పడేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) అని పిలిచే అరుదైన రక్తం గడ్డకట్టే పరిస్థితికి దారితీస్తుందని ఆ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా అంగీకరించింది.
కొన్ని అరుదైన సందర్భాల్లో టీటీఎస్ వల్ల మెదడుతో పాటు ఇతర భాగాల్లో రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం జరుగుందని ఆ సంస్థ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ఈ టీకా తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయంటూ ఆస్ట్రాజెనెకా కంపెనీపై బ్రిటన్ లో కేసులు నమోదు అయ్యాయి. దీని విచారణ సందర్భంగా ఆ సంస్థ ఆ దుష్ప్రభావాలు వాస్తవమే అని అంగీకరించింది. దీంతో ఈ కోవిషీల్డ్ ఒక్క సారిగా వార్తల్లో నిలిచింది.
ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ భారత్ లో కోట్ల మంది జనాభా వినియోగించుకున్నారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టడంలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. అయినప్పటికీ.. దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు వాస్తవమే అని కంపెనీ అంగీకరిచడం ఇప్పుడు అనేక మందిని కలవరానికి గురి చేస్తుంది. కొంత మంది రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వారందరినీ ఈ అంశం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని, ఈ అంశం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.