Feb 9, 2023, 4:50 PM IST
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కష్టకాలం నుండి రాష్ట్రం గాడిన పడిందని... ప్రభుత్వ ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ద్వారా జనవరి 2023 నాటికి రూ. 46,231 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామన్నారు. అంటే దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబర్ 2022 నాటికి జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతంగా వుంటే ఏపీలో 26.2 శాతంగా వుంది. తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన జీఎస్టి వసూళ్లు ఏపీలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.