సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కారణమిదే..: గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్

Jan 31, 2023, 10:41 AM IST

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండవడం కలకలం రేపింది.  గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మీట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి న్యూడిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం తిరిగి గన్నవరంలోనే అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగానే అత్యవసర ల్యాండ్ అయినట్లు అధికారులు చెబుతున్నా జగన్ సెక్యూరిటీపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్వయంగా గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే తిరిగి అత్యవసరంగా ల్యాండయినట్లు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. విమానం గాల్లో వుండగా సాంకేతిక సమస్య గుర్తించిన పైలట్స్ తిరిగి గన్నవరంలోనే ల్యాండ్ చేసారని తెలిపారు. విమానాన్ని ముందుగానే అంతా చెక్ చేసుకున్నామని... అయితే సాంకేతిక సమస్య ఏ టైం లో అయినా రావచ్చన్నారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ కు కూడా సాంకేతిక సమస్యవల్లే... వేరే ఏ కారణాలను ఆపాదించడం తగదని లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేసారు.