Feb 6, 2023, 4:44 PM IST
అమరావతి : మహిళా సాధికారత, భద్రతపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒంటిరగా సైకిల్ యాత్ర చేపట్టిన యువతికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. మధ్య ప్రదేశ్ కు చెందిన పర్వాతారోహకురాలు ఆశా మాలవ్య ఒంటరిగానే యావత్ దేశాన్ని సైకిల్ పై చుట్టివచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల మీదుగా 8వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏపీకి చేరుకున్నారు ఆశా. ఈ క్రమంలో ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు.
మహిళా సాధికారత కోసం ఆశా చేపట్టిన సాహస యాత్ర సీఎం జగన్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటన్నానని... మహిళల కోసం ఆశా మాలవ్య కృషి ప్రశంసనీయమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టివచ్చేలా 25వేల కిలోమీటర్లు ప్రయాణించాలని ఆశా లక్ష్యంగా పెట్టుకుంది.