ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతూ ప్రశ్నించిన వారిని అరెస్ట్‌ చేయడం, వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు శూన్యమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 9 నెలల చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఇప్పటికే విరక్తి మొదలైందన్నారు. అందుకే ప్రజలు 'హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ' అంటున్నారని చెప్పారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చంద్రబాబు మార్క్‌ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉందన్నారు. ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీనవర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌ కనిపించడం లేదన్నారు. ఏపీ అంటే అమరావతే అన్నట్టు అమరావతి అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించి, రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లోని ఫ్రీబస్, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం... తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం ద్వారా వాటి అమలుపైనా అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.