జయశంకర్ సార్ బతికే ఉంటే ?

First Published Jun 21, 2017, 6:47 PM IST
Highlights

జీవితాంతం తెలంగాణ కోసం తపించిన మహా మనిషి ప్రొఫెసర్ జయశంకర్.  తెలంగాణ కల నెరవేరకముందే క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారాయన. తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో పనిచేశారు జయశంకర్. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న. జయశంకర్ సార్ బతికే ఉంటే ఆయన ఎలా ఉండేవారు? ఎక్కడుండేవారు?

ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ సాధనే ధ్వేయంగా పనిచేసిన జయశంకర్ సార్ మరణించి నేటికి ఏడేళ్లు. నేడు ఆయన 7వ వర్ధంతిని తెలంగాణలోని వాడ వాడలా జరుపుకుంటున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్  జయశంకర్ సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నవాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. 


మరోవైపు తెలంగాణ జెఎసి జయశంకర్ సార్ వర్ధంతి నాడే అమరుల స్పూర్తి యాత్రను ప్రారంభించింది. గన్ పార్కు వద్ద విద్యావేత్త చుక్కా రామయ్య జెండా ఊపి అమరుల స్పూర్తి యాత్ర  ప్రారంభించారు. జెఎసి అమరుల స్పూర్తి యాత్ర తొలి భాగాన్ని కెసిఆర్ సొంత జిల్లాలలోనే ప్లాన్ చేసింది. ఇది రాజకీయంగా చర్చనీయాంశమైంది.

 

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం  వహించిన వారిలో కీలకమైనవారు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అయితే మరొకరు  జెఎసి ఛైర్మన్ కోదండరాం. వీరిద్దరి శ్రమ ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్న చర్చ జనాల్లో ఉంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మూడేళ్లలో ఈ ఇద్దరూ పరస్పర  భిన్న ధృవాలుగా మారిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత జెఎసిని చిన్నాభిన్నం చేసేందుకు కెసిఆర్ ప్రయత్నించారు. జెఎసిలో కీలకమైన వారిని టిఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు జెఎసికి దూరమయ్యాయి. దీంతో అధికార పార్టీ  బలం ముందు జెఎసి బలం చిన్నబోయిందన్న వాతావరణం ఉంది. 

 

జయశంకర్ సార్ బతికి ఉంటే  ఆయన రెండు మార్గాలు అనుసరించే అవకాశం ఉండేది.
1.    కెసిఆర్ స్థాపించిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరడం లేదా ప్రభుత్వం ఏదైనా పదవి ఇస్తే అందులో చేరి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును  అందించడం
2.    కోదండరాం తరహాలో ప్రజలపక్షం వహించడం, సామాజిక తెలంగాణ కోసం తనవంతు ప్రయత్నాలు చేయడం, అవసరమైతే నిర్భందాలను సైతం ఎదుర్కోవడం.

 

ఈ పరిస్థితుల మధ్య జయశంకర్ సార్ నిజంగా బతికే ఉంటే ఆయన ఏపక్షాన ఉండేవారు? అన్నదానిపై ఏసియా నెట్ పలువురితో చర్చించింది. వారు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. ఆ వివరాలు చూద్దాం.

 

కెసిఆర్ ను మరింత బలోపేతం చేసేవారు : నారదాసు లక్ష్మణరావు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ

దీనిపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పందించారు. జయశంకర్ సార్ మంత్రిపదవులు తీసుకునే వారు కాదు, టిఆర్ఎస్ లో చేరేవారు కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన ఏ పాత్ర పోశించారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా  అటువంటి పాత్రలోనే ఉండేవారు. ఉద్యమకాలంలో కెసిఆర్ తో ఎలాంటి సబంధాలు కలిగి ఉన్నారో అలాగే వ్యవహరించేవారు. గతంలో ఎలాంటి సలహాలు, సూచనలు ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చేవారు. కోదండరాం  వైపు వెళ్లే అవకాశమే లేదు. టిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుడిగా, టిఆర్ఎస్ కు శ్రేయోభిషిగా, నిరంతర తెలంగాణ ఉద్యమకారుడిగానే ఉండేవారు. కెసిఆర్ పైన స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి జయశంకర్ సార్.  ఏ విషయంలో కల్పించుకోవాలి, ఏ విషయంలో దూరంగా ఉండాలన్నదానిపై క్లారిటీతో  ఉండేవారు. భారతంలో కృష్ణుడి పాత్రను తెలంగాణలో జయశంకర్ సార్ పోశించేవారు. కెసిఆర్ పాలనను చూసి ఆనందించేవారు.

జయశంకర్ సార్ ప్రజలపక్షం ఉండేవారు : రఘు, తెలంగాణ జెఎసి నేత 

జెఎసి నేతల వాదన మరోవిధంగా ఉంది. దీనిపై జెఎసి నేత రఘు మాట్లాడారు. జయశంకర్ సార్ బతికే ఉంటే ఆయన వందకు వంద శాతం ప్రజల పక్షాన నిలిచేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో మాత్రమే కెసిఆర్ తో ఉన్నారు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ తో కలిసి ఉండేవారు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 85 శాతంగా ఉన్న దళిత, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసేవారు. గతంలోనే ఆయనకు ఎన్నో పదవులు వచ్చినా చేపట్టలేదు. సార్ లక్ష్యాలు, ఆశయాలు ఏంటో ఆయన రాసిన పుస్తకాలు చదివితే అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ ను జెఎసి ఛైర్మన్ గా ప్రతిపాదించినప్పుడు ఆయన తిరస్కరించారు. తాను అనారోగ్యంగా ఉన్నందున ఆ బాధ్యతలు చేపట్టలేనని, దానికి సరైన పర్సన్ కోదండరాం అని జయశంకర్ సార్ సూచించారు. ఆయన సూచన మేరకే ఆనాడు కోదండరాం ఆనాడు జెఎసి ఛైర్మన్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం  చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను గుడ్డిగా సమర్థిస్తూ బిటి బ్యాచ్ లో మాత్రం చేరేవాడు కాదు.

 

ఇదీ జయశంకర్ ప్రస్థానం 

1934, ఆగస్టు 6వ తేదీన వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం, అక్కంపేటలో కొత్తపల్లి జయశంకర్ జన్మించారు.

 

తల్లి మహాలక్షీ, తండ్రి లక్షీకాంతరావు. జయశంకర్ కు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కా చెళ్లెల్లు. ఇంట్లో రెండో సంతానం జయశంకర్.

 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సైద్ధాంతి ప్రాతిపదికను రూపొందించడమే కాకుండా  ఆజన్మాంతం  బ్రహ్మచారిగానే ఉండి తెలంగాణ సాధన కోసం పనిచేశారు.

 

విద్యార్థి దశ నుంచే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం  తపించారు. అధ్యాపకుడిగా, వైస్ చాన్సలర్ గా ఆయన తెలంగాణ కోసం వేల ఉపన్యాసాలు ఇచ్చారు. జనాలను చైతన్యం చేశారు.

 

తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం జయశంకర్ సొంతం. ఆయన తెలంగాణ కోసం అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసి తెలంగాణ ప్రజానీకంలో భావజాల వ్యాప్తికి నిరంతరం పాటుపడ్డారు.

 

2011, జూన్ 21న సార్ తుదిశ్వాస విడిచారు.

 

అక్కంపేట గ్రామం  నుంచి ఎదిగి తెలంగాణ జాతి  పితగా పిలవబడుతున్న జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని అక్కంపేట  మూలమలుపు దగ్గర ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటును గ్రామస్తులే చేశారు.
 

 

click me!