సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. అగ్గిపెట్టెలోనే ఇమిడిపోయే అంగీ, లుంగీ

By Siva KodatiFirst Published Aug 8, 2021, 3:22 AM IST
Highlights

చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అగ్గిపెట్టెలో ఇమిడే అంగీ, అగ్గిపెట్టెలో ఇమిడే లుంగీలను తయారు చేసి మరో కొత్త ఆవిష్కరణకు తెరదీశాడు సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్. 
 

అగ్గిపెట్టలో ఇమిడే చీర, దబ్బనములో దూరే చీరను రూపొందించి సిరిసిల్ల ఖ్యాతిని నలు దిశల చాటి చెప్పాడో కళాకారుడు. అదే స్పూర్తితో అగ్గిపెట్టలో ఇమిడిపోయే విధంగా మగ్గంపై శాలువను, చొక్కాను తయారు చేసి ఇక్కడి నేతన్నల ఘనతను మరోమారు ప్రపంచానికి చాటి చెపుతున్న వైనంపై స్పెషల్ స్టోరీ.

సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఓ నేత కళాకారుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గతములో అగ్గిపెట్టలో దూరే చీర, శాలువను నల్ల పరందాములు అనే నేత కార్మికుడు  రూపొందించి, సిరిసిల్ల పట్టణ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాడు. అదే కోవలో పట్టణానికే చెందిన మరో చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ కూడా మగ్గంపై చిత్ర విచిత్ర కళారూపాలను రూపొందిస్తూ, సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటుతున్నాడు. గతంలో హరిప్రసాద్ ఎన్నో అద్బుతాలను చేనేత మగ్గాలపై రూపొందించాడు. ఇప్పటికే ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనములో నుండి దూరే చీరలను ఇతడు తయారు చేశాడు.

తాజాగా, చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అగ్గిపెట్టెలో ఇమిడే అంగీ, అగ్గిపెట్టెలో ఇమిడే లుంగీలను తయారు చేసి మరో కొత్త ఆవిష్కరణకు తెరదీశాడు. ప్రస్తుతం చేనేత మగ్గం పై 150 గ్రాముల బరువుతో 2 మీటర్ల సిల్క్ లుంగీని అగ్గిపెట్టలో పట్టే విదముగా దాదాపు రెండు వారాలు కష్టపడి తయారు చేశాడు. అంతేకాకుండా అదే సిల్క్ ను ఉపయోగించి బట్టను నేసి, ఆ బట్టను చొక్కగా కుట్టించుకొని అది కూడా అగ్గిపెట్టలో పట్టేందుకు వీలుగా కృషిచేశాడు. హరిప్రసాద్ కళాత్మకతకు ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ రోజుల్లో ఈ తరహా కళాఖండాలను తయారు చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉన్నపని.. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని అద్భుతాలను సృష్టిస్తానని హరిప్రసాద్ చెబుతున్నారు. 

click me!