హైదరాబాద్ లోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024 సదస్సు జరిగింది. వెరికోస్ వెయిన్స్ సమస్యపై ఈ సదస్సులో పాల్గొన జాతీయ, అంతర్జాతీయ వైద్యులు, వైద్య నిపుణులు చర్చించారు.
హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25% మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. అయితే చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయవచ్చని... ఇందుకోసం ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని సూచిస్తున్నారు. వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు.
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. మాదాపూర్‌లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్‌లైన్‌లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.
undefined
ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.
అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాస్క్యులర్ సర్జన్లు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొని, ఏయే రకాల సమస్యలకు ఎలాంటి చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయో తెలిపారు. సంక్లిష్టమైన కేసుల విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని సీనియర్ వైద్యులు వివరించారు. వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని సూచించారు.
అగ్రశ్రేణి వాస్క్యులర్ నిపుణులందరూ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అన్ని ప్రాంతాల వైద్యులకు ఈ సమస్యలు, వాటి చికిత్సా విధానాలపై అవగాహన కల్పించడం ఎంతో మంచి విషయమని అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ రాజా వి. కొప్పాల తెలిపారు. ఇది కేవలం సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే కాదని, భారతదేశంలో భవిష్యత్తు వైద్యవిధానాలనే మార్చేందుకు ఒక అద్భుత అవకాశమని ఆయన అన్నారు. శస్త్రచికిత్సలు అవసరం లేకుండా నయం చేసే విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో మన దేశంలోని వివిధ ప్రాంతాల వైద్యులు కూడా వీటి గురించి తెలుసుకుని, తమ ప్రాక్టీసులో అమలుచేసే అవకాశం ఉందని తెలిపారు.
దాంతోపాటు.. లేజర్ సహా ఈ రంగంలో ఉపయుక్తంగా ఉండే పలు పరికరాలను ఉత్పత్తి చేసే మెడ్‌ట్రానిక్ తదితర పలు కంపెనీల జాతీయ స్థాయి ప్రతినిధులు కూడా హాజరై, తమ పరికరాలు ఏయే విభాగాల్లో ఎలా ఉపయోగపడతాయో వివరించారు.