సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

By telugu teamFirst Published Sep 16, 2019, 6:09 PM IST
Highlights

యురేనియం తవ్వకాలపై తెలంగాణలోని ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమం లేవదీయడం ద్వారా తెలంగాణ సిఎం కేసీఆర్ చిక్కుల్లో పడేద్దామని తలచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పరిస్థితి ఎదురుతిరిగింది. ఆయన ప్రయత్నాన్ని కేసీఆర్ తిప్పికొట్టారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహరచనలో దాన్ని ఆచరణలో పెట్టడంలో దిట్ట అనేది మరోసారి రుజువైంది. సేవ్ నల్లమల పేరు మీద నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై తనపై గురిపెట్టిన బాణాన్ని కేసీఆర్ వెనక్కి మళ్లించారు. 

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి కేసీఆర్ ను చిక్కుల్లో పడేయాలనే జనసేన అధినేత వ్యూహాన్ని తిప్పికొట్టారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ సోమవారం హైదరాబాదులోని దస్పల్లా హోటల్లో అఖిల పక్షసమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

అఖిల పక్ష సమావేశానికి ఇతర పార్టీల నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు కూడా సమ్మతి తెలిపారు. నిజానికి, తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావుతో కలిసి పవన్ కల్యాణ్ యురేనియం వ్యతిరేక పోరాటానికి స్కెచ్ వేశారు. అయితే, అది వారికే ఎదురు తిరిగింది.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అంతేకాదు, యురేనియం తవ్వకాలకు కేంద్రానికి భూములు ఇవ్వబోమని కూడా స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర పరిధిలోది కాదని కూడా స్పష్టం చేశారు. ఆ రకంగా సూటిగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై బాణం ఎక్కుపెట్టారు. 

తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ ఓ మెట్టు పైకెక్కి బిజెపి, కాంగ్రెసులపై నిందలు మోపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అనుమతి ఇచ్చిందని, ప్రస్తుత బిజెపి కేంద్ర ప్రభుత్వం తవ్వకాలు చేస్తామంటోందని చెప్పడం ద్వారా అది తమ ప్రభుత్వ వ్యవహారం కాదని తేల్చేశారు. పైగా, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసిన కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు.

కేసీఆర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను ఆనుకుని నల్లమల అడవులు ఉంటాయి. దాంతో ఆయన ఆ రకంగా చెప్పారు. తద్వారా తాము యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగానే ఉన్నామని చెప్పారు. 

కేసీఆర్ వ్యూహం వల్ల పవన్ కల్యాణ్ గానీ, కాంగ్రెసు నేతలు గానీ ఎవరిపై పోరాటం చేయాలనే విషయాన్ని తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. వారు కేంద్ర ప్రభుత్వంపైనే పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై ఉద్యమం నిర్వహిస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన కాంగ్రెసుతో కలిసి పోరాటం చేస్తారా అనేది మరో ప్రశ్న.

సంబంధిత వార్తలు

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...

 

click me!