సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

By telugu teamFirst Published Sep 16, 2019, 5:47 PM IST
Highlights

సేవ్ నల్లమల పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పూనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలపై ఆయన బిజెపి, కాంగ్రెసులపై నిందలు మోపారు.

హైదరాబాద్: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కాంగ్రెసు, బిజెపిలపై నిందలు మోపారు. 

నల్లమల్లపై తమ వైఖరిని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. కేంద్రం తవ్వకాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు  ఆరోపణలు చేస్తున్నారని ఆయన అడిగారు.గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తే ఇప్పుడు ఉన్న బిజెపి కేంద్ర ప్రభుత్వం తవ్వకాలు చేస్తామని అంటోందని ఆయన అన్నారు.

ఈ రోజు స్వయంగా సభలో యురేనియం తవ్వకాలకు  వ్యతిరేకంగా తీర్మానం చేశారని, అందుకు మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. పనిలేక కొంతమంది నాయకులు స్టార్ హోటళ్లలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంపై వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తే తమకు అంటగట్టడమెందుకని ఆయన అడిగారు. ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం పెడితే  తమ  పార్టీ నుండి కూడా హాజరవుతామని ఆయన చెప్పారు. 

click me!