పోలవరం బ్యాక్ వాటర్‌తో పెను ముప్పు ఉందన్న తెలంగాణ.. 90 గ్రామాలకు సమస్యే.. పోరాడాలని నిర్ణయం..!

By Sumanth KanukulaFirst Published Jul 28, 2022, 10:39 AM IST
Highlights

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణకు పెను ముప్పు పొంచి ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణకు పెను ముప్పు పొంచి ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇటీవల పోలవరం బ్యాక్ వాటర్.. భద్రాచలం, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయని.. మొత్తంగా 90 గ్రామాలకు ఇది పెద్ద సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అందువల్ల గోవారి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ సహా.. పరిష్కారం కోసం అన్ని మార్గాల్లో పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అదే సమయంలో న్యాయపరమైన అవకాశాలను కూడా తెలంగాణ సర్కార్ అన్వేషిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించడానికి కేంద్రం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంతోపాటు.. ఐటీసీ భద్రాచలం, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌లకు కూడా ముప్పు వాటిల్లుతుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఐటీసీ భద్రాచలం, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న అణుశక్తి విభాగం రెండూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశాయని అధికారులు తెలిపారు. వారి అభిప్రాయాలు, భయాలను నివృత్తి చేయాలని కోరిన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి  స్పందన లేదని చెప్పారు. 

అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సంబంధింత విభాగాల అనుమతులు తీసుకున్నందున తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. అయితే నీటి విస్తరణ ప్రాంతాలను గుర్తించకపోతే.. ప్రాజెక్టు వల్ల 90 గ్రామాలు ముప్పును ఎదుర్కొంటాయని ఆయన చెప్పారు. జీఆర్‌ఎంబీ సమావేశంతో పాటుగా.. పీపీఏ సమావేశాల్లో కూడా వారు సమస్యను లేవనెత్తారని.. అయితే పోలవరం నీటి ప్రభావిత ప్రాంతంపై జీఆర్ఎంబీ ఇంకా అధ్యయనానికి ఆదేశించలేదని రజత్ కుమార్ అన్నారు. 

ఐఐటీ-హైదరాబాద్ అధ్యయనంలో 45,000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని స్పష్టంగా పేర్కొందని.. అయితే కేవలం 200 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయని ఏపీ అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇది పెద్ద ముప్పుగా మారనుందని.. అందువల్ల సాధ్యమయ్యే ప్రతి ప్రభావాన్నిపోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా అధ్యయనం చేయాలని, క్షుణ్ణంగా పరిశీలించాలని ఒక అధికారి కోరారు. భద్రాచలానికి 30 కి.మీ ఎగువన ఉన్న దుమ్ముగూడెం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. భద్రాచలం పట్టణం కూడా ముంపునకు గురవుతుందని చెప్పారు. 

వరదల సమయంలో అదనపు నీటిని మళ్లించడమే కాకుండా.. 450 టీఎంసీల స్టోరేజీతో ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలను తీర్చేందుకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును రూపొందించినట్లు ఇరిగేషన్ సీనియర్ అధికారులు తెలిపారు. దీని కోసం నీటి మళ్లింపును సులభతరం చేయడానికి ప్రాజెక్టును పూర్తి రిజర్వాయర్ స్థాయి పరిస్థితులను ఎక్కువ కాలం నిర్వహించవలసి ఉంటుందని చెప్పారు. ఇది భద్రాచలం, దుమ్ముగూడెం పట్టణాలతో పాటుగా పరిసర ప్రాంతాలు వరద ముప్పును నిరంతరం కలిగిస్తుందని తెలిపారు. 

click me!