ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. నాయకుల భవితవ్యం, ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే.. గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో గెలుపుపై అటు అధికార వైసీపీతో పాటు.. ఇటు కూటమి పార్టీలు కూడా దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల ఫలితాలపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాలపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందనీ, వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక తెలంగాణ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ .. తాను ప్రత్యేకంగా సర్వే చేయించాననీ, తన సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా వెల్లడవుతుందనీ, ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానమేనని అన్నారు. ఇక
నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కరెక్ట్ గా లేరని, వారు గెలవడం కష్టమన్నారు. ఇక పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందనీ, కేసీఆర్ ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడ్డాయని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హావా కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో వివేక్ భారీ స్థాయిలో డబ్బులు పంచారనీ, తాను సిరిసిల్లలో వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదనీ, కావాలంటే..వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగండని అన్నారు.
మల్కాజ్ గిరికిలో ఈటల రాజేందర్ ను గెలిపించాలని కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలో నించిందని విమర్శలు గుప్పించారు. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయమని, తమ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించడంతో పూర్తిగా సమీకరణాలు మారిపోయాయనీ, ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావుని కమ్మ సామాజికవర్గం గెలిపించుకుంటున్నారు. ఎవరు ఎన్ని అంచనాలు వేసిన..ఓటు నాడీ మాత్రం జూన్ 4 నాడే తెలుస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరే చూడాలి.