ఎవడో పిచ్చోడు ఈడీకి లేఖ రాశాడు: డ్రగ్స్ ఇష్యూపై కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు

By telugu teamFirst Published Sep 18, 2021, 1:52 PM IST
Highlights

తనను డ్రగ్స్ అంబాసిడర్ అనడంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము ఎవరినీ వదిలిపెట్టబోమని, అందరి బాగోతాలు బయటపెడుతామని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా ప్రతిస్పందించారు.  డ్రగ్స్ వ్యవహారంలో ఓ పిచ్చోడు తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడని ఆయన వ్యాఖ్యానించారు. 

కాంగ్రెసు సీనియర్ నేతలు గాడిదలు అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డగాడిదనా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ చేసుకునేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని అన్నారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీద తప్ప బిజెపి, కాంగ్రెసుల గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన షర్మిలపై విరుచుకుపడ్డారు. బిజెపి, కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే దళితబంధు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. 

"నన్ను డ్రగ్స్ అంబాసిడర్ అంటారా?" అని ఆయన మండిపడ్డారు.  తనకూ డ్రగ్స్ కు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారం విషయంలో తాను అన్ని రకాల అనాలిసెస్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని చెబుతూ కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా అని కేటీఆర్ సవాల్ చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాగుబోతు అంటారా అని ఆయన ప్రశ్నించారు. తాము ఎవరినీ వదిలిపెట్టబోమని, వారి బాగోతాలు బయటపెడుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే వారిపై రాజద్రోహం కేసులు పెడుతామని అన్నారు. సున్నాలు వేసేవారు కన్నాలు పెడుతారని వ్యాఖ్యానించారు. 

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెసుకు డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. జూన్ 2వ తేదీ తెలంగాణ విమోచన దినమని ఆయన అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ పలువురు తెలుగు సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. 

click me!