రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

By pratap reddyFirst Published Sep 23, 2018, 1:38 PM IST
Highlights

వినాయకచవితి నవరాత్రుల పీడ దినాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. దీంతో కొండా సురేఖ సోమవారం టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా, పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా అనేది తేలే అవకాశం ఉంది. 

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యురాలు కొండా సురేఖ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది. బహుశా ఆమె రేపు (సోమవారం) తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

వినాయకచవితి నవరాత్రుల పీడ దినాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. దీంతో కొండా సురేఖ సోమవారం టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా, పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా అనేది తేలే అవకాశం ఉంది. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలని ఆమె టీఆర్ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆమె టీఆర్ఎస్ నాయకత్వానికి విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, ఆమెకు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి సమాధానాలు వచ్చిన సూచనలేవీ కనిపించడం లేదు.

కాగా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆమెతో రాయబారాలు నడిపినట్లు మాత్రం తెలుస్తోంది. అయితే, తాను వినాయక చవితి నవరాత్రులు ముగిసిన తర్వాత ఏ విషయమూ చెబుతానని ఆమె చెప్పినట్లు సమాచారం. 

అయితే, కొండా దంపతులు టీఆర్ఎస్ లో కొనసాగే పరిస్థితి లేదని విశ్వసనీయవర్గాల సమాచారం. కేసిఆర్ తనయుడు, మంత్రి కెటి రామారావుపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీఆర్ఎస్ లో కొనసాగితే పరిస్థితి ఏలా ఉంటుందనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. 

కొండా సురేఖ దంపతులు మూడు సీట్లు అడిగారని, ఆ మూడు సీట్లు ఇవ్వకపోవడం వల్లనే తిరుగుబాటు బావుటా ఎగురేశారని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ స్థితిలో తన కుటుంబానికి మూడు టికెట్లు కేటాయించినా లేదా తాను వరంగల్ ఈస్ట్ సీటుతో రాజీ పడినా ప్రజల్లోకి ఏ విధమైన సంకేతాలు వెళ్తాయనే విషయంపై కొండా సురేఖ అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

బ్లాక్ మెయిల్ చేసి తాను తన డిమాండ్ ను సాధించుకున్నాననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే అది తమకు వ్యతిరేకంగా పనిచేస్తుందని కొండా సురేఖ భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే మూడు సీట్లకు తమ కుటుంబసభ్యులు పోటీ చేయాలనే ఆలోచనలో కొండా దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఈస్ట్ తో పాటు పరకాల, భూపాలపల్లి సీట్లలో పోటీ చేయాలని వారు అనుకుంటున్నారు. 

స్వతంత్రంగా పోటీ చేసే కన్నా ఏదైనా పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో గానీ, తెలుగుదేశం పార్టీలో గానీ, టిజెఎస్ లో గానీ చేరే అవకాశాలు లేవని అంటున్నారు. దాంతో వారు కాంగ్రెసు వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. బహుశా రేపు (సోమవారం) కొండా దంపతులు టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునే విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చునని అంటున్నారు.

మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకోవడానికి సమయం ఉందని కూడా వారు భావించవచ్చునని అంటున్నారు. మరోసారి టీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు కురిపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

click me!
Last Updated Sep 23, 2018, 1:38 PM IST
click me!