కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉడినట్లు..: ధరణి పోర్టల్ పై కోమటిరెడ్డి సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Oct 05, 2021, 05:34 PM ISTUpdated : Oct 05, 2021, 05:38 PM IST
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉడినట్లు..: ధరణి పోర్టల్ పై కోమటిరెడ్డి సెటైర్లు

సారాంశం

ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యిందని... వెంటనే అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. 

నల్గొండ: ధరణి పోర్టల్ లో సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పోర్టల్ రైతాంగం యొక్క పాత సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చి పెట్టిందని... కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లుగా పరిస్థితి తయారయ్యిందని ఎద్దేవా చేశారు. అన్నదాతల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎంపీ  కోమటిరెడ్డి లేఖ రాశారు. 

''తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి dharani portal ను అమల్లోకి తెచ్చింది. అయితే సమస్యల పరిష్కారం అటుంచి అన్నదాతల భూ వివాదాలను మరింత క్లిష్టతరం చేసింది. ఇలా ధరణి అభాసుపాలవుతోంది'' అని పేర్కొన్నారు.  

''ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి దాదాపుగా 11 నెలలు కావస్తోంది. ఈ 11 నెలల్లో ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చబడ్డ భూములను తొలగించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య సుమారుగా లక్ష వరకు ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో  రైతుల నుంచి అర్జీలు వచ్చినా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమేరకు దృష్టిసారించిందో అర్థం కావడంలేదు'' అన్నారు.

read more  మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

''రాష్ట్ర రైతాంగం యొక్క భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ధరణి పోర్టల్ లోని అనేక కొత్త సమస్యలకు కారణమవుతున్న మూలాల్లోకి వెళదాం. 2007 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్  చట్టంలోని సెక్షన్ ౼ 22A లో నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చింది. 2007 నుండి ఇప్పటివరకు రకరకాల కారణాలతో దాదాపు 20 లక్షల ఎకరాల పట్టభూమిని నిక్షిప్తం చేసింది. వివాదరహితంగా ఉన్నటువంటి పట్టా భూములకు సంబంధించిన కొన్ని వేల సర్వే నెంబర్లను కూడా రిజిస్ట్రేషన్ శాఖ తీవ్ర నిర్లక్ష్యంతో సెక్షన్ ౼ 22A లో చేర్చింది'' అన్నారు.

''2007౼08 సంవత్సరాల్లో అప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి తహశీల్దార్లు, దేవాదాయ శాఖ అధికారులు, వక్ఫ్ బోర్డ్ అధికారులు అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు చెప్పి వివిధ కారణాలతో కొన్ని లక్షల ఎకరాల పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ౼ 22A కు సంబంధించిన నిషేధిత జాబితాలో చేర్పించి ఇప్పటి ధరణి సమస్యలకు బీజం వేశారు. 20 లక్షల ఎకరాల భూమిని, కొన్ని వేల సర్వే నెంబర్లను నిక్షిప్తం చేసుకున్న సెక్షన్ ౼ 22A రెగ్యులర్ గా అప్ డేట్ అవ్వట్లేదు. ఇలా అప్ డేట్ కాకపోవడమే ధరణి ద్వారా ఉత్పన్నమవుతున్న అనేక చిక్కుముళ్ళకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు'' అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

''ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రిజిస్ట్రేషన్ చట్టం లోని సెక్షన్ ౼ 22A ను అప్ డేట్ చెయ్యాలి. అలా చేస్తే ధరణి ద్వారా పుట్టుకొచ్చిన అనేక కొత్త సమస్యలలో దాదాపు 50% సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని భూ చట్టాల నిపుణులు, రైతుల తరపున అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు'' అని సూచించారు.

''రిజిస్ట్రేషన్ చట్టం లోని సెక్షన్ ౼ 22A ను అప్ డేట్ చెయ్యకుండా... తలకు దెబ్బ తగిలితే మోకాలికి చికిత్స చేసినట్టుగా ప్రభుత్వం ధరణి సమస్యల మూలకారణాన్ని అన్వేషించకుండా కేవలం తాత్కాలిక పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది.  2 రోజుల్లో ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను అనాలోచితంగా ఆదేశించడం రైతులను విస్మయానికి గురిచేస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చెయ్యాలి'' అని సీఎస్ కు రాసిన లెఖలో పేర్కొన్నారు కోమటిరెడ్డి. 

PREV
click me!

Recommended Stories

Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?