గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్: ఆచూకీ లేని మరో మహిళ, పోలీసుల అదుపులో ఏడుగురు

By narsimha lodeFirst Published Aug 17, 2021, 9:34 AM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనపై చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మరో మహిళ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఉమామహేశ్వరరావుతో పాటు ఏడుగురిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో చికిత్స కోసం ఆయన ఈ నెల 4వ తేదీన గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య, భార్య చెల్లెలు కూడ ఉన్నారు.

ఇదే ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ బాధితుడికి దూరపు బంధువు. దీంతో ఆయన సహాయంతో ఆసుపత్రికి వచ్చారు.  బాధితుడు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.

ఈ నెల 7వ తేదీ నుండి బాధితుడి భార్యతో పాటు ఆయన చెల్లె కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి వద్దకు రాలేదు. ఈ నెల 9వ తేదీన బాధితుడి వద్దకు  కొడుకు వచ్చాడు. రెండు రోజులుగా తల్లి, పిన్ని కన్పించడం లేదని ఆయన కొడుకుకు వివరించాడు. దీంతో వారి కోసం అతను కూడా గాలించాడు. కానీ వారి గురించి ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ నెల 11వ తేదీన ఆసుపత్రి నుండి తండ్రిని కొడుకు స్వగ్రామం తీసుకెళ్లాడు. అయితే  రెండు రోజుల క్రితం ఉమా మహేశ్వర్  ఫోన్ చేసి ఆసుపత్రి  వెనుక భాగంలోని గదిలో పిన్ని ఉందని ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో రోగి కొడుకు హైద్రాబాద్ కు చేరుకొని  ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె తీవ్రమైన షాక్‌లో ఉంది. ఇంటికి వెళ్లిన మరునాడు ఆమె కోలుకొన్న తర్వాత తనకు జరిగిన  అన్యాయాన్ని వివరించింది.

తనకు కర్చీఫ్ లో మత్తు మందిచ్చి ఉమామహేశ్వర్ సహా అతని స్నేహితులు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో గ్రామస్తులతో కలిసి ఆమె ఈ నెల 16న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:గాంధీ ఆసుపత్రిలో దారుణం: అక్కా చెల్లెళ్లపై రేప్, పోలీసులకు ఫిర్యాదు

ఉమామహేశ్వర్ సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కిడ్నీలు పాడైన రోగి భార్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె ఎక్కడుందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు  అక్కాచెల్లెళ్లను నిందితుడు ఎక్కడ ఉంచాడనే విషయమై ఆరా తీస్తున్నారు. ఉమా మహేశ్వరరావుతో పాటు ఎవరెవరికి ఈ  ఘటనలో ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉమామహేశ్వర్ కూడ విధులకు సరిగా హాజరు కావడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. విధులకు హాజరైనా కూడ ఒకటి రెండు గంటలు మాత్రమే పనిచేసి తిరిగి వెళ్తున్నాడని తోటి సిబ్బంది చెబుతున్నారు.

click me!