టీపీసీసీ చీఫ్: రేవంత్‌కు నో అంటున్న సీనియర్లు, పోటీ పడుతున్నది వీరే

By narsimha lodeFirst Published Nov 1, 2019, 7:56 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవికి రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ పదవికి రేవంత్ రెడ్డిని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. 

 మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించే అవకాశం ఉంది. దీంతో ఈ పదవి కోసం ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ పడుతున్నారు.

టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తిగా లేరు.ఆయన పదవి కాలం ముగిసింది. ఈ పదవి కాలాన్ని ఇంకా పొడిగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించిన తర్వాత పార్టీలో నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆధిపత్యం చేస్తున్నారని పార్టీలోని ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అభిప్రాయం నెలకొంది.

2014-2019 వరకు సీఎల్పీ నేతగా జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ ఇద్దరూ నేతలు వైఫల్యం చెందారని పార్టీలో ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ.బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు వాదిస్తున్నారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరారు.వి.హనుమంతరావు కూడ పీసీసీ చీఫ్ పదవిని కోరుకొంటున్నారు. బీసీ సామాజిక వర్గం కోటాలో ఈ పదవిని తనకు కట్టబెట్టాలని ఆయన పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు.

వి.హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. సుధీర్ఘంగా పార్టీ కోసం సేవ చేసినవారికి పీసీసీ చీఫ్ పోస్టును కట్టబెట్టాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వివాదాలకు దూరంగా ఉండే మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కోరే నేతలు కూడ లేకపోలేదు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా తేలాల్సి ఉంది. 75 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను ఎత్తివేస్తేనే ఎన్నికలు నిర్వహిస్తారు.హైకోర్టు స్టే ఎత్తివేతకు ప్రభుత్వం  చర్యలు తీసుకోవాల్సి ఉంది.

హైకోర్టులో స్టే ఎత్తివేయకపోతే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమైతే టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని త్వరగానే నియమించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే ఈ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త వారిని ఎంపిక చేస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్‌నగర్‌లో ఓటమి ఎఫెక్ట్: ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారా?

ఈసారి ఓటెయ్యనివారు వచ్చే ఎన్నికల్లో ఓటేసేలా పనిచేస్తా: ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు: టీఆర్ఎస్ పై ఉత్తమ్ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ

click me!