సీఈవో రజత్ కుమార్ కు 15ఎకరాల భూమి: సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Oct 31, 2019, 5:09 PM IST
Highlights

వాట్సప్ గ్రూపులలో తనకు ఆ భూమి గిఫ్ట్ గా బదిలీ చేసినట్లు వార్తలను ఖండించారు. ఎన్నికల్లో కొంతమందికి అనుకూలంగా పనిచేశానని అందుకు గిఫ్ట్ గా భూమి బదిలీ చేశారంటూ వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

హైదరాబాద్: సైబరాబాద్ క్రైం పోలీసులను ఆశ్రయించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

వివరాల్లోకి వెళ్తే తనకు 15ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 15 ఎకరాల 25 గుంటల భూమి తన పేరుట బదిలీ అయ్యిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైం పోలీసులను కోరారు. 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామంలో భూమి కొనుగోలు చేసినట్లు ప్రచారం చేసినట్లు తెలిపారు. హేమాజీపూర్ గ్రామంలో కొనుగోలు చేసినట్లు వన్ బీ నమూనాను సైతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చెయ్యడంపై రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సప్ గ్రూపులలో తనకు ఆ భూమి గిఫ్ట్ గా బదిలీ చేసినట్లు వార్తలను ఖండించారు. ఎన్నికల్లో కొంతమందికి అనుకూలంగా పనిచేశానని అందుకు గిఫ్ట్ గా భూమి బదిలీ చేశారంటూ వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2013-14 సంవత్సరంలో తాను మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

అయితే ఆ భూమికి సంబంధించి 1బీ నమూనాను ఆధారంగా చేసుకుని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. భూమికి సంబంధించిన ఆధారాలను సైతం ఆయన పోలీసులకు అందజేశారు. 

click me!