పేమెంట్స్ బ్యాంక్‌ సేవల్లోకి ‘ఫేస్‌బుక్’: ఆర్బీఐకి సంస్థ సీఈఓ లేఖ

By rajesh yFirst Published Dec 3, 2018, 10:36 AM IST
Highlights


స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మెసేజింగ్ సేవలందిస్తున్న ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ‘వాట్సాప్’.. తాజాగా పేమెంట్ సేవలను అందుబాటులోకి తేవాలని.. తద్వారా మిగతా సంస్థలతోపాటు పోటీ పడాలని తలపోస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే భారతదేశంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న ఫేస్ బుక్.. మొత్తం తమ భారత ఖాతాదారులకు పేమెంట్ సేవలందించేందుకు అనుమతించాలని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాసింది.

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికల్లో అగ్రగామిగా దూసుకువెళుతున్న ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ ‘వాట్సాప్’.. ఇక చెల్లింపుల విభాగంలోకి ప్రవేశించడానికి కసరత్తు చేస్తున్నది. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ)కు ఫేస్ బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ సీఈఓ క్రిస్ డానియల్ లేఖ రాశారు. సంస్థకు భారత్‌లో 20 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరికి చెల్లింపుల సేవలు అందించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తమ ప్రత్యర్థి సంస్థ గూగుల్.. ‘గూగుల్ పే’ పేరిట పేమెంట్స్ బ్యాంకులో అడుగు పెట్టేందుకు సిద్దమైన నేపథ్యంలో వాట్సాప్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

మోసపూరిత మేసేజ్‌లపై ఇప్పటికే సంస్థపై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ నుంచి అంత తొందరగా అనుమతులు లభించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఈ చెల్లింపుల సేవలు అందించాలంటే పలు నియంత్రణ మండళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వంతో చర్చలు జరిపిన రెండేళ్ల తర్వాత ఈ విభాగంలోకి ప్రవేశించినట్లు అవుతున్నది. పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే సంస్థ పది లక్షల మంది యూజర్లకు ఈ నూతన సర్వీసులను అందిస్తున్నది.

ప్రస్తుతం వాట్సప్ పైలెట్ ప్రాజెక్టు కింద పేమెంట్ సేవలందిస్తున్నది.భారత్‌లో గల మొత్తం తమ వినియోగదారులకు ఇలాంటి సేవలు అందించడానికి అనుమతించాలని ఆర్బీఐకి కంపెనీ చీఫ్ క్రిస్ డేనియల్స్ లేఖ రాశారు. తద్వారా వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతున్నదని, అలాగే దేశీయంగా డిజిటల్ రంగంలో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు రాసిన లేఖలో డానియల్ పేర్కొన్నారు. గత నెల 5నే ఆయన ఈ లేఖ రాశారు. 

దీనిపై వాట్సప్ ప్రతినిధి స్పందిస్తూ భారత ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)లతోపాటు పలు బ్యాంకులు, చెల్లింపుల సేవలు అందించే సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. గత ఏప్రిల్‌లో పేమెంట్స్ బ్యాంక్ సేవలందిస్తున్న సంస్థలు స్థానికంగానే డేటా నిల్వ చేయాలన్న ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమని వాట్సాప్ హామీ ఇచ్చింది.  వాట్సాప్ సీఈఓ డానియల్ రాసిన లేఖపై ఆర్బీఐ ఇంకా ప్రతిస్పందించలేదు. 

click me!