ట్విట్టర్‌కు షాక్: కో ఫౌండర్ విలియమ్స్ గుడ్ బై.. ఇక అంతా పర్సనలే

By rajesh yFirst Published Feb 23, 2019, 10:23 AM IST
Highlights

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఇవాన్ విలియమ్స్ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు లేఖ రాశారు. తనతో కలిసి పని చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ట్విట్టర్ స్పందించలేదు. 

ట్విటర్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విటర్‌కు భారీ షాక్‌ ఇచ్చారు. దాదాపు 13 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి  వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్వటర్‌ కు తన సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి  వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు. అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. 13 సంవత్సరాల పాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్  పేర్కొన్నారు.  

‘ఇక నుంచి నేను, నా టీం ఇతర ప్రాజెక్టులపై సమయం కేటాయించడంపైనే కేంద్రీకరిస్తాం’ అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన లేఖలో తెలిపారు. ఈ వార్త బయటకు లీక్ కాగానే తన సహచరులందరికి ఇవాన్ విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు.

‘నాతో కలిసి ఒక క్రేజీ కంపెనీని ప్రారంభించినందుకు, దాన్ని మెరుగైన సంస్థగా తీర్చిదిద్దడంలో కలిసి పని చేసినందుకు థాంక్యూ @జాక్, థ్యాంకూ @ బిజ్. నా సహచర బోర్డు సభ్యులకు, పాత, కొత్త సహచరులకు ధన్యవాదాలు. సవాళ్లతో కూడిన సమయంలో పని చేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇంకా దీనిపై ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా ప్రతిస్పందించలేదు. 

2007లో జాక్ డోర్సీ, బిజ్ స్టోన్‌లతో కలిసి మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’ను ప్రారంభించారు. 2008లో సంస్థ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఇవాన్ విలియమ్స్ స్థానే తర్వాత జాక్ డోర్సీ వచ్చారు. 

తెర వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆధారాలు చూపినా, ప్రారంభం నుంచి విలియమ్స్ ఇప్పటి వరకు ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 2010లో డిక్ కొస్టొలో ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జాక్ డోర్సీ.. ట్విట్టర్ సీఈఓగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!