‘స్మార్ట్ ఫోన్ల’కు గిరాకీ ఫుల్: కలిసొచ్చిన ఆన్‌లైన్ ఆఫర్లు...

By Sandra Ashok KumarFirst Published Nov 12, 2019, 11:08 AM IST
Highlights

ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 9.3 శాతం వృద్ధితో దిగుమతులు 4.66 కోట్లకు చేరాయి. స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్‌ ఆఫర్లు కలిసొచ్చాయి. కొత్త ఆవిష్కరణలతోపాటు వాటి ధరల తగ్గింపుతోనూ గిరాకీ పెరిగిందని ఇంటర్నేషనల్ డేటా సెంటర్ (ఐడీసీ) తెలిపింది. అయితే, చైనా స్మార్ట్ ఫోన్ల ముందు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ విలవిల్లాడుతున్నది. అధిక ధరల విభాగంలో మాత్రం ‘ఆపిల్’ ఫోన్లదే ఆధిపత్యం. 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఆఫర్లు, కొత్త ఆవిష్కరణలు, ధరల దిద్దుబాట్లతో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్‌ దిగుమతులు గతంతో పోల్చితే 9.3 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 46.6 మిలియన్‌ యూనిట్లకు చేరుకున్నాయని రిసెర్చ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ డాటా కార్పొరేషన్‌ (ఐడీసీ) తెలిపింది. 

ఐడీసీ తన జూలై- సెప్టెంబర్ త్రైమాసిక మొబైల్‌ ఫోన్‌ ట్రాకర్‌ నివేదికలో సోమవారం తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో ఈ-కామర్స్‌ రిటైల్ సంస్థల విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లదే పైచేయిగా నిలిచింది. పండుగల సందర్భంగా క్యాష్‌బ్యాక్‌, బైబ్యాక్‌ ఆఫర్లతో ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ అదరగొట్టాయి.

నో కాస్ట్‌ ఈఎంఐ, ఫైనాన్స్‌ వంటి అంశాలు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లను పెంచాయి. దీంతో నిరుడుతో పోలిస్తే 45.4 శాతం వృద్ధి నమోదైందని ఐడీసీ ఇండియా క్లయింట్‌ డివైజెస్‌ అసోసియేట్‌ రిసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, సంప్రదాయ మార్కెట్‌లో కొనుగోళ్లు క్షీణించాయి. మెజారిటీ కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లోనే కొన్నారని ఐడీసీ తెలిపింది.

also read సూపర్ ట్రిక్.. ఇన్‌స్టాలో మిమ్మల్ని ఎవరు అన్ ఫాలో చేస్తే ఇట్టే తెలుసుకోవచ్చు..

మొబైల్‌ వినియోగదారుల్లో ఫీచర్‌ ఫోన్లకు డిమాండ్‌ తగ్గింది. అంతా స్మార్ట్‌ఫోన్ల వైపే మొగ్గు చూపుతుండటంతో ఈ జూలై-సెప్టెంబర్‌ కాలంలో గతంతో చూస్తే 17.5% దిగుమతులు తగ్గిపోయాయి. దిగుమతులు 35.6 మిలియన్‌ యూనిట్లకే పరిమితమైనట్లు ఐడీసీ ఇండియా రిసెర్చ్‌ డైరెక్టర్‌ (ఐపీడీఎస్‌) నవ్‌కేందర్‌ సింగ్‌ తెలిపారు. 

ఈ అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలోనూ ఫీచర్‌ ఫోన్లకు ఆదరణ తగ్గవచ్చని ఐడీసీ ఇండియా రిసెర్చ్‌ డైరెక్టర్‌ (ఐపీడీఎస్‌) నవ్‌కేందర్‌ సింగ్‌ అభిప్రాయ పడ్డారు. భారతదేశ మార్కెట్‌లో మరోసారి చైనా మొబైల్‌ ఫోన్ల హవా కొనసాగింది. అమ్మకాల్లో టాప్‌-5 సంస్థల్లో ప్రస్తుతం నాలుగు ఫోన్లు చైనావే కావడం గమనార్హం.

షియోమీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో షియోమీ 12.6 మిలియన్‌ యూనిట్లను దిగుమతి చేసుకున్నది. గతేడాదితో పోలిస్తే 8.5 శాతం అధికం. షియోమీకి చెందిన రెడ్ మీ 7ఏ, రెడ్ మీ నోట్‌ 7 ప్రో మోడళ్లకు విశేష ఆదరణ లభించిందని ఐడీసీ పేర్కొన్నది.

ఇంకా వివో 58.7 శాతం, ఒప్పో 92.3 శాతం వృద్ధిని అందుకున్నాయి. వివో వై సిరీస్‌కు, ఒప్పో ఏ5కి పెద్ద ఎత్తున డిమాండ్‌ కనిపించింది. కాగా, వివో వి15 ప్రో, రెడ్ మీ కే20 స్మార్ట్‌ఫోన్లకు రూ.20 వేలు-35 వేల ధరల శ్రేణిలో మంచి ఆదరణ ఉందని ఐడీసీ పేర్కొన్నది.

టాప్‌-5లో ఉన్న ఏకైక చైనాయేతర సంస్థ శామ్‌సంగ్‌. ఒకప్పుడు మార్కెట్‌ రారాజుగా వెలుగొందిన శామ్‌సంగ్‌కు ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గెలాక్సీ మొబైళ్లనే నమ్ముకున్న శామ్‌సంగ్‌.. దీపావళికి ముందు గెలాక్సీ ఏఎస్‌ సిరీస్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

aslo read లింక్డ్ ఇన్ కొత్త ఫీచర్‌: ఫ్రెండ్లీ ఫ్రీలాన్సర్

ఇక అధిక ధరల విభాగంలో ఆపిల్‌ ఆధిపత్యం కొనసాగుతున్నది. 51.3 శాతం వాటా ఈ సంస్థదేనని తాజా ఐడీసీ సర్వేలో తేలింది. ఇదిలా ఉంటే మొబైల్‌ ఫోన్ల కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

ఫోన్ల కొనుగోళ్లను కొంత మంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మొబైల్స్‌పై వెచ్చించే మొత్తం 2.4 శాతం క్షీణించి 3,337.9 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్‌ నివేదిక చెబుతోంది. 

ఆర్థిక వ్యవస్థలోమందగమనం నెలకొన్న నేపథ్యలో ఈ ప్రతికూల అంచనా వెలువడటం గమనార్హం. కాగా వచ్చే ఏడాదిలో మొబైల్‌ ఫోన్ల వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపే అవకాశం ఉన్నందున ఐటీ పై ఖర్చులు పుంజు కోవచ్చునన్నది. 2020 ఐటీ వ్యయాల్లో 6.6 శాతం వృద్ధి చెంది 8,850 కోట్ల డాలర్ల నుంచి 9,400 కోట్ల డాలర్లకు పెరగవచ్చని తెలిపింది.

click me!