దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది. 2010 తర్వాత కష్టాల్లో చిక్కుకున్న మైక్రోసాఫ్ట్ తాజాగా గత శుక్రవారం ముగిసిన ట్రేడింగ్ తో తన మార్కెట్ క్యాపిటలైజేషన్ 851.2 బిలియన్ల డాలర్లకు పెంచుకోగా, యాపిల్ 847.4 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది.
అమెరికా మార్కెట్లలో శుక్రవారం ఓ సంచలనం నమోదైంది. ఎనిమిదేళ్లలో తొలిసారి మైక్రోసాఫ్ట్ సంస్థ తన పోటీదారు యాపిల్ కంటే అత్యధిక విలువతో వారాన్ని ముగించింది. ఈ వారం మొత్తం రెండు సంస్థల షేర్లు నువ్వా?నేనా? అన్నంత పోటీగా మార్కెట్ విలువను పెంచుకొంటూ పోయాయి.
శుక్రవారం ట్రేడింగ్ చివర్లో ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ యాపిల్‌ను దాటేసింది. దీంతో ఈ వారంలో సంస్థ విలువ దాదాపు 110 బిలియన్ డాలర్లు పెంచుకుని 851.2 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో యాపిల్ విలువ 847.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
undefined
దాదాపు పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ పూర్వవైభవాన్ని అందుకొంది. ఈ ఘనత వెనక సంస్థ సీఈఓ తెలుగు తేజం సత్యనాదెళ్ల వ్యూహాలు, కృషి ఉందని టెక్నాలజీ నిపుణలు చెబుతున్నారు.
గత 12నెలల్లోనే కంపెనీ విలువ 30శాతానికి పైగా పెరిగిందంటే సత్య వ్యూహ చతురతను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్, క్లౌడ్ ఉత్పత్తులపైనే ఆయన కేంద్రీకరించడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఒకవేళ ఈ ఏడాది చివరి వరకు ఇలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ ముందుకెళ్లగలిగితే 2002 తర్వాత తొలిసారి ఆ రికార్డు నెలకొల్పి టెక్నాలజీ లీడర్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
2010 దశకంలో మైక్రోసాఫ్ట్ కష్టాలిలా..
2010లో మైక్రోసాఫ్ట్ అత్యధిక కష్టాలను ఎదుర్కొన్నది. కొత్తగా వచ్చే టెక్నాలజీ మార్కెట్‌ను కొల్లగొట్టడంలో విఫలం కావడంతో ఒక దశలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది. 2012లోనైతే అత్యల్పవృద్ధిని నమోదు చేసింది.
మరోపక్క సరికొత్త ఉత్పత్తులతో యాపిల్ దూసుకెళ్లింది. ఐఫోన్ రాకతో యాపిల్ స్వరూపమే మారిపోయింది.2010లో క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లోకి మ్రైకోసాఫ్ట్ అడుగుపెట్టినా వేగంగా వృద్ధి చెందుతున్న క్లౌడ్ కంప్యూటింగ్‌లో సాఫ్ట్‌గా తనదైన ముద్ర వేయలేకపోయింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు చాలా నెమ్మదిగా ఉండేవనే అప్రతిష్ఠనూ మూటగట్టుకుంది.
అప్పటికే అమెజాన్ ‘క్లౌడ్‘ సేవలు
అప్పటికి నాలుగేళ్ల క్రితమే అమెజాన్ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ స్థాయిలో సేవలు అందించడానికే మైక్రోసాఫ్ట్‌కు నాలుగేళ్ల సమయం పట్టింది. అందుకు కారణాలూ ఉన్నాయి. అప్పటివరకు మైక్రోసాఫ్ట్ విండోస్‌నే ప్రధాన వ్యాపారంగా చేసుకున్నది.
క్లౌడ్ మార్కెట్ శక్తిని, త్వరిత వ్యాప్తిని అంచనా వేయలేకపోవడంతో మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ రంగం ఒక అనుబంధ వ్యాపారంగానే మిగిలింది. ఫలితంగా మందగించిన వృద్ధి రూపంలో మైక్రోసాఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకుంది.
2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా స్టీవ్ బామర్ స్థానే సత్య నాదెళ్ల
2014లో నాటి మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి నుంచి స్టీవ్ బామర్ వైదొలగారు. సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు. నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మైక్రోసాఫ్ట్ వ్యాపారంలో లోపాలను గుర్తించి సరిచేయడం ప్రారంభించారు.
వ్యాపారాన్ని అత్యధిక ఆదాయం వచ్చే రంగం వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఆయన క్లౌడ్ రంగంపై తన దృష్టిని సారించారు. ఫలితంగా ఏడాదిలోనే ఆ రంగంలో మైక్రోసాఫ్ట్ వాటా రెట్టింపై 13శాతానికి చేరింది.
ఇలా గూగుల్ యాప్స్‌కు మైక్రోసాఫ్ట్ పోటీ
ఈ దశలో మైక్రోసాఫ్ట్ తన ఆయుధాలకు పదును పెట్టింది. కీలకమైన ఆఫీస్ అప్లికేష్లనకు క్లౌడ్ వెర్షన్‌గా ‘ఆఫీస్ 365’ను తీసుకొచ్చింది. ఇది గూగుల్ యాప్స్‌కు విపరీతమైన పోటీని ఇచ్చింది.
మరోపక్క విజయాలతో పాటే ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క ఏడాదిలో 15శాతం అంటే దాదాపు 110 బిలియన్ డాలర్ల ఆదాయం పెరిగింది. దీనిలో వడ్డీలు, పన్నుల చెల్లింపునకు ముందు నిర్వహణ లాభాలు 35 బిలియన్ డాలర్లు.
ఫోన్ల బిజినెస్ కు ఇలా సత్య నాదెళ్ల స్వస్తి
2013లో మైక్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసినప్పుడు ‘భవిష్యత్‌లోకి ధైర్యంగా వేసిన అడుగు’’ అని నాటి సీఈవో స్టీవ్ బామర్ పేర్కొన్నారు. కానీ సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టన ఏడాదికే నష్టాలొస్తున్న ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలికారు.
యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వంటి దిగ్గజాలతో ఈ రంగంలో పోటీపడేందుకు ఆసక్తి చూపలేదు. దీనివల్ల దాదాపు 7.6 బిలియన్ డాలర్ల భారం మైక్రోసాఫ్ట్‌పై పడింది. 7,800 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఇక ఎక్స్‌బాక్స్ వ్యాపారంలో కూడా మార్పులు చేశారు.
ఇలా లింక్డ్ ఇన్ కొనుగోలుతో కీలక మలుపు
క్లౌడ్ సాంకేతికత అప్లికేషన్ల అభివృద్ధి కోసం ఎజూర్ క్లౌడ్ టెక్నాలజీని బలోపేతం చేశారు. మరోపక్క వృత్తి నిపుణుల సోషల్ నెట్‌వర్క్ సంస్థ లింక్డ్‌ఇన్‌ను 26.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ‘దీంతో క్లౌడ్ కంప్యూటింగ్, వృత్తి నిపుణులు దగ్గరయ్యారు’ అని లింక్డ్ ఇన్ సంస్థ కొనుగోలు సందర్భంగా నాదెళ్ల వ్యాఖ్యానించడం మైక్రోసాఫ్ట్ భవిష్యత్ వ్యూహానికి అద్దం పట్టింది.
ఈ ఏడాది దాదాపు 7.5 బిలియన్ డాలర్లను చెల్లించి గిట్‌హబ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ ఓపెన్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌కు దాదాపు 2.8కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇదీ సంస్థ వినియోగదారుల సంఖ్యనూ, మార్కెట్ విస్తృతినీ పెంచేది.
ఇలా యాప్స్ విభాగంలోకి అడుగులు
మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే నమ్ముకొని వ్యాపారం చేయడం కష్టమని నాదెళ్ల గుర్తించారు. దీంతో మైక్రోసాఫ్ట్ యాప్స్‌ను రంగంలోకి దించారు. ఇవి ప్రత్యర్థులకు చెందిన యాపిల్ మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా పనిచేయడం గమనార్హం.
ఓ పక్క యాపిల్, గూగుల్, ఫేస్ బుక్ వంటి దిగ్గజ టెక్ సంస్థల షేర్లు కుదేలవుతున్నా మైక్రోసాఫ్ట్ షేర్ విలువ ఏడాదిలో దాదాపు 30శాతం పెరిగింది. ‘మనం నేర్చుకునేందుకు చాలా కుతూహలం చూపాలి. నేర్చుకున్న దానిని మైక్రోసాఫ్ట్‌లోకి తేవాలి’’ అని సత్య నాదెళ్ల తన పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’’ లో పేర్కొన్నారు. ఈ మాటలు వ్యక్తిగతంగానే కాదు, సంస్థ అభివృద్ధికి బాటలు వేశాయి.
నాలుగున్నరేళ్లలో మైక్రోసాఫ్ట్ ఇలా విజయతీరాలకు
కాకపోతే కష్టాల్లో చిక్కుకున్న మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓగా 2014లో బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల నాలుగున్నరేళ్లకు దాదాపు విజయతీరాలకు చేర్చారనే అభినందనలు వెలువడుతున్నాయి. ఒక్క నవంబర్ నెలలోనే మైక్రోసాఫ్ట్ షేర్ ఏడు శాతం పెరిగింది.
మరోవైపు యాపిల్ 16 శాతం నష్టపోయింది. దీనికి ఐపోన్ విక్రయాలు, పడిపోవడంతో వెనకబడింది. మరోవైపు అమెజాన్ ఐదువారాలుగా పోటీ పడుతున్నా.. లక్ష్యానికి చేరుకోలేక 826 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచింది.