వచ్చేనెల 26న విపణిలోకి శామ్‌సంగ్‌ ఫోల్డబుల్: ఐదేళ్ల వరకు నో ప్రాబ్లం

By rajesh yFirst Published Mar 30, 2019, 10:28 AM IST
Highlights


దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ఆవిష్కరణ తేదీ వచ్చేసింది. వచ్చేనెల 26న విపణిలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఫోల్డబుల్ ఫోన్ కదా? ఎన్నిసార్లు మడిచినా ఫర్వాలేదా? అన్న సందేహాలను శామ్ సంగ్ నివ్రుత్తి చేసింది. రెండు లక్షల సార్లు ఫోల్డ్ చేసినా, రోజుకు వందసార్ల చొప్పున మడిచినా ఐదేళ్ల వరకు ఏ ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చునని పేర్కొంది.

 

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ మేజర్ శాంసంగ్ త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ అందుబాటులోకి తేనున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ ఈ ఫోన్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఈ ఫోన్‌ను ఎక్కువసార్లు మడతబెడుతూ ఉంటే పాడైపోదా? అసలు ఎన్నిరోజులు ఈ ఫోన్‌ పనిచేస్తుంది? వంటి ప్రశ్నలకు శామ్‌సంగ్‌ సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన 34 సెకన్ల వీడియోను పంచుకుంది. 

ఇందులో ఫోన్‌కు శామ్‌సంగ్‌ ఫోల్డ్‌ టెస్ట్‌ నిర్వహించింది. రెండు లక్షలసార్లు ఈ ఫోన్‌ను మడత బెట్టినా చక్కగా పనిచేస్తుందని శామ్‌సంగ్‌ చెబుతోంది. అంటే రోజుకు వందసార్లు చొప్పున ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చట.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. శామ్‌సంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ చివరి నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది సుమారు 1980 డాలర్లు (సుమారు రూ.1.40లక్షలు) ఉండవచ్చని చెబుతున్నారు. మరి భారత్‌లో దీన్ని ఎంత ధరకు తీసుకొస్తారో చూడాలి. 

ఈ ఫోన్ 7.3 అంగుళాల డైనమిక్‌ ఆమోల్డ్‌ మెయిన్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోల్డింగ్ చేసినప్పుడు 4.6 అంగుళాలకు పరిమితం అవుతుంది.  6 అంగుళాల హెచ్‌డీ+ సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 7-నానోమీటర్‌ టెక్నాలజీతో తయారైన స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ఇందులో అమర్చారు. 12 జీబీ ర్యామ్‌ ప్లస్512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కూడా ఉంటుంది. 

మూడు బ్యాక్, మూడు రేర్ కెమెరాలు ఉన్న ఫోన్ కూడా ఇదే. త్రీ రేర్ కెమెరాల్లో 12 ఎంపీ వైడ్ యాంగిల్, 12 ఎంపీ టెలిఫొటో కెమెరా, 16 ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. వీటితోపాటు 10 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8ఎంపీ డెప్త్ కెమరా, కెమెరా ఆన్ ఫ్రంట్‌లో 10 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. 

4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం గల శామ్ సంగ్ గేలాక్సీ ఫోన్ గ్రీన్, బ్లూ, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. మోస్ట్ స్టాండ్డర్డ్ ఆండ్రాయిడ్ యాప్స్ మాత్రమే గేలాక్సీ ఫోల్డ్ ఫోన్‌లో పని చేస్తాయి. 

click me!