అంపశయ్యపై బీఎస్‌ఎన్‌ఎల్‌: 54 వేల మందికి ‘వీఆర్ఎస్’

By rajesh yFirst Published Apr 4, 2019, 10:56 AM IST
Highlights

ఒకనాడు భారతదేశం నలు చెరగులా చరవాణిగా సేవలందించిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పూర్తిగా అంపశయ్యపై ఉంది. అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నా.. ప్రైవేట్ పట్ల మోజుతో పాలకులు స్పెక్ట్రం కేటాయింపులు, రీచార్జింగ్ ఫెసిలిటీస్ కల్పించడంలో సాచివేత ధోరణి అవలంభించడం కూడా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కష్టాలకు కారణంగా కనిపిస్తున్నది. దీనికి తోడు రెండేళ్ల క్రితం 4జీతో సంచలనాలకు దిగిన రిలయన్స్ జియో కూడా ఒక కారణమే ఫలితంగా ఎకాఎకీన 54 వేల మందికి పైగా ఉద్యోగులకు ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ కింద రిటైర్మెంట్ వయో పరిమితి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీని అమలు కోసం ఎన్నికల సంఘం ఆమోదం కోసం టెలికం శాఖ ఎదురు చూస్తోంది. 

న్యూఢిల్లీ : దేశీయ టెలికాం రంగంలో ముకేశ్‌​ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీ పోటీ కంపెనీలను భారీగా దెబ్బతీసింది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  (బీఎస్‌ఎన్‌ఎల్‌) తీవ్ర నష్టాలతో కుదేలైంది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక బీఎస్‌ఎన్‌ఎల్‌ చరిత్రలో తొలిసారి ఇబ్బందులు పడింది. ఈ చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయలను అప్పు చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నది. 

ఎన్నికలు ముగిసే లోపు గానీ, తర్వాత గానీ సంస్థలో వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఏ క్షణమైనా తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు 54వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. 

గత నెలలో జరిగిన బీఎస్ఎన్ఎల్ బోర్డు సమావేశం ఈ మేరకు  నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా.. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించింది. 

పదవీ విరమణ వయసును 60 ఏండ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, 50 ఏళ్లు దాటిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇంటికి పంపించడం, మూడవ ప్రతిపాదన 4జీ స్పెక్ట్రం కేటాయించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 31శాతం అంటే సుమారు 54,451 మంది  ప్రభావితం కానున్నారు.

బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ ఉద్యోగులకు  వీఆర్‌ఎస్‌ పథకం అమలు ఆమోదానికి టెలికాం విభాగం క్యాబినెట్‌ నోట్‌ను తయారు చేస్తోంది. అలాగే ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక అనుమతిని కోరనుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు  వీఆర్‌ఎస్‌ పథకానికి 10 ఏళ్ల బాండ్లను జారీచేయనుంది. 

click me!