సింధూ వెనుక అన్నీ తానై నడించిన.. ‘పార్క్’

By AN TeluguFirst Published Aug 2, 2021, 10:33 AM IST
Highlights

సంతోషంతో పరుగున అతని దగ్గరికి వెళ్లిన ‘మనం సాధించాం’ అన్నట్టుగా అతడ్ని గట్టిగా హత్తుకుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు పివి. సింధు కోచ్ పార్క్ తే సాంగ్. వీరిద్దరి కొన్నేళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పథకం ఆమెకు దక్కడంతో.. 42 ఏళ్ల పార్క్.. ఆనందం పట్టలేక పోయాడు.

టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు సంతోషంతో గట్టిగా అరిచేసింది. ఆమెను ఫోకస్ చేసిన కెమెరాలు అన్నీ ఆ తరువాత కోర్టు బయట ఓ మూలనున్న వ్యక్తిమీదికి ఫోకస్ అయ్యాయి. అక్కడ అతను పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు.

సంతోషంతో పరుగున అతని దగ్గరికి వెళ్లిన ‘మనం సాధించాం’ అన్నట్టుగా అతడ్ని గట్టిగా హత్తుకుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు పివి. సింధు కోచ్ పార్క్ తే సాంగ్. వీరిద్దరి కొన్నేళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పథకం ఆమెకు దక్కడంతో.. 42 ఏళ్ల పార్క్.. ఆనందం పట్టలేక పోయాడు.

ఒలింపిక్స్ లో సింధు విజయం వెనక అతనిది కీలకపాత్ర.  2019 నుంచి ఆమెకు శిక్షణ ఇస్తున్న అతను ఆమె ఆటలోని లోపాలను సరి చేస్తూ సాగుతున్నాడు,  ఆమె డిఫెన్స్ లో బలహీనంగా ఉండడంతో ఆ విభాగంలో ఎక్కువ దృష్టిపెట్టి కావాల్సిన మార్పులను తీసుకు వచ్చాడు. కోర్టులో చురుగ్గా కదిలేలా ఆమెకు  తర్ఫీదు ఇచ్చాడు. 

2019లో ప్రపంచ చాంపియన్ షిప్ లో  సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. సింధు కరోనా విరామంతో కోల్పోయిన ఆటను తిరిగి అందుకుని మునపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు. 

పార్క్ ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ ఆటగాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో పార్క్ క్వార్టర్ వరకు వెళ్ళగలిగాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్ షిప్స్ లో కాంస్యం గెలిచాడు పార్క్.  2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్ లో అతనూ ఓ సభ్యుడు. ఆతర్వాత కోచ్ గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. 2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్ గా పనిచేశాడు.

ఆ తరువాత భారత క్రీడా ప్రాధికార సంస్థ అతడిని కోచ్ గా నియమించింది. ఆటమీద విస్తృతమైన జ్ఞానం, గొప్ప అవగాహన ఉన్న అతను.. ఆ తరువాత సింధు ఆటలను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఎప్పటికప్పుడూ ఆమె ఆటలో మార్పలు తెస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థుల ఆటతీరును పసిగట్టి, పక్కా ప్రణాళికలు రూపొందించి సింధు విజయాల్లో కీలకంగా మారాడు. 

అతని శిక్షణలో తన ఆటతీరు కచ్చితంగా మెరుగవుతుందన్న సింధు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఒలింపిక్స్ కు సమర్థంగా సన్నద్దమయ్యే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో పార్క్ పర్యవేక్షణలో సింధు ప్రాక్టీస్ సాగింది. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి.. ఆమెతో ఆడించేవాడు. 

సింధును అయోమయంలోకి గురిచేసేలా వివిధ రకాల షాట్లు ఆడమని ఆ కుర్రాళ్లకు చెప్పి.. వాటిని తిప్పికొట్టేలా.. ఆమెకు మెళకువలు నేర్పాడు. నెట్ దగ్గర షటిల్ ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడే ఉండిపోయిన అతను గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియా వెళ్లలేదు. తన నాలుగేళ్ల కూతురిని కూడా కలవలేదు. అతని ఈ  త్యాగాలకు ఇప్పుడు ఫలితం దక్కింది.
 

click me!