PBKS vs RR : ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ బెర్తును నిలబెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత ఆటతీరు గాడితప్పింది. వరుస తప్పిదాలతో ప్లేఆఫ్స్ కు ముందు వరుసగా ఓటములను చవిచూస్తోంది.
PBKS vs RR : ఐపీఎల్ 2024 ఆరంభంలో వరుస విజయాలతో గర్జించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ కు ముందు వరుస పరాజయాలతో సంజూ శాంసన్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లు సమీపిస్తున్న తరుణంలో రాజస్థాన్ ఆట పట్టాలు తప్పింది. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన పంజాబ్ చేతిలో రాజస్థాన్ చిత్తుగా ఓడింది. పంజాబ్ తరఫున సామ్ కుర్రాన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ జట్టు విఫలమైంది. మ్యాచ్‌లో బౌలర్లు జట్టును మంచి ఊపు అందించారు. కానీ, చివర్లో పంజాబ్ ప్లేయర్లు అశుతోష్ శర్మ, కెప్టెన్ సామ్ కుర్రాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. రాజస్థాన్‌పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సంజూ శాంసన్ టీమ్ బ్యాటింగ్ లో విఫలం..
ఐపీఎల్ 2024 65వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ టాప్ ఆర్డర్ ఫ్లాప్ ఈ మ్యాచ్ లో కూడా కనిపించింది. కేవలం 4 పరుగుల స్కోరు వద్ద యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఔట్ అయి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ శాంసన్ కూడా అంచనాలను అందుకోలేక 18 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. అయితే, రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 34 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. అశ్విన్ 28 పరుగులు చేసినా, ఆ తర్వాత వికెట్ల పతనం జరిగింది. దీంతో రాజస్థాన్ జట్టు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సామ్ కర్రాన్ ఆల్ రౌండ్ షో..
పంజాబ్ విజయంలో కెప్టెన్ సామ్ కుర్రాన్ హీరోగా నిలిచాడు. మొదట బౌలింగ్ చేస్తూనే రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్‌లను పెవిలియన్ కు పంపాడు. ఛేజింగ్ లో పంజాబ్‌కు మంచి ఆరంభం లభించలేదు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ సామ్ కుర్రాన్ పంజాబ్ ట్రబుల్ షూటర్ అని మరోసారి నిరూపించాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లతో 63 పరుగులతో పంజాబ్ కు విజయాన్ని అందించాడు.
రాజస్థాన్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉంది
ఢిల్లీపై లక్నో ఓటమితో రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. లీగ్ రౌండ్‌లో జట్టు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్లేఆఫ్‌కు ముందు రాజస్థాన్ వరుసగా 4 పరాజయాలను ఎదుర్కొంది. టేబుల్ టాపర్ కేకేఆర్ తో జట్టు తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కేకేఆర్‌తో ప్లేఆఫ్‌కు ముందు రాజస్థాన్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వస్తుందా? లేదా అనేది చూడాలి.
టీమిండియా ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్?... రాహుల్ ద్రవిడ్ ను ఈ సీఎస్కే స్టార్ భర్తీ చేస్తాడా?