నచ్చకపోతే నా ముఖంలోనే కనపడుతుంది... రోహిత్ తో విభేదంపై కోహ్లీ

By telugu teamFirst Published Jul 30, 2019, 9:49 AM IST
Highlights

కొందరు కావాలనే ఇలాంటి లేని పోని విషయాలను సృష్టించి తమ ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే రోహిత్ అంటే తనకు నచ్చపోతే... అది తన ముఖంలోనే కనపడుతుంది కదా అని ప్రశ్నించారు. 


టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయని... వీరి కారణంగా టీం ఇండియాలో లుకలుకలు మొదలయ్యాయని గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా... ఈ విషయంపై ఎట్టకేలకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా నోరు విప్పారు. త్వరలో వెస్టిండీస్ పర్యటన ఉండగా... కోహ్లీ మీడియా ముందుకు వచ్చి అన్నింటికీ సమాధానాలు ఇచ్చాడు.

తనకు రోహిత్ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా కోహ్లీ స్పష్టం చేశాడు. ఇలాంటి వార్తలను తాను పెద్దగా పట్టించుకోనని కోహ్లీ అన్నారు. రోహిత్ కి తనకీ మధ్య గొడవలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలను తాను చదివానని... ఇలాంటి వార్తలు సృష్టించడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తనకి అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

కొందరు కావాలనే ఇలాంటి లేని పోని విషయాలను సృష్టించి తమ ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే రోహిత్ అంటే తనకు నచ్చపోతే... అది తన ముఖంలోనే కనపడుతుంది కదా అని ప్రశ్నించారు. చాలా సార్లు తాను రోహిత్ ని బహిరంగంగానే ప్రశంసించినట్లు గుర్తు చేశారు. 

రోహిత్ అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని మరోసారి ప్రశంసించారు. దశాబ్దకాలంగా తామిద్దరం కలిసి క్రికెట్ ఆడుతున్నామని చెప్పారు. నిజంగా టీమ్‌ వాతావరణం సరిగా లేకపోతే అన్ని ఫార్మాట్లలో మా ఆటతీరు నిలకడగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు.  నాలుగేళ్ల కష్టంతో టెస్టుల్లో జట్టును ఏడో నెంబర్‌ నుంచి నెంబర్‌వన్‌కు తీసుకువచ్చామని  చెప్పారు. . క్రికెట్‌లో ఒకరిపై మరొకరికి నమ్మకం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.  ఓసారి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చి జూనియర్‌, సీనియర్‌ ఆటగాళ్లతో మేమంతా ఎంత సరదాగా ఉంటామో పరిశీలించాలని..మేమైతే ఓ వీడియో తీసి సాక్ష్యాలుగా మీకు చూపించలేం కదా అని వివరణ ఇచ్చారు. 

click me!