హనుమజ్జయంతి

By telugu news teamFirst Published Jun 4, 2021, 12:44 PM IST
Highlights

ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

            బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగాతా
            ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాద్భవేత్

"యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్’" అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు.

హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి. అయితే ఈ పండుగను కొంత మంది చైత్ర మాసంలో మరికొంత మంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. 'పరాశర సంహిత'  ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 
 
అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 
 
అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 
 
ఈ రోజున సువర్చలా సహిత ఆంజనేయ స్వామికి వైభవంగా వివాహ మహోత్సవం జరుగుతుంది. హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.. అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు అంటుంటారు. 


 

click me!