జగన్ మూడు రాజధానులు-నోరు జారిన శేఖర్ గుప్తా

By sivanagaprasad Kodati  |  First Published Dec 29, 2019, 3:29 PM IST

ఇది “తుగ్లక్” నిర్ణయం కనుక అయితే, రాష్ట్ర ప్రజలు ‘ఉగాది’ ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో ఈ వీడియో చూసాక ఎటూ గుప్తాకు వోటు వేస్తారు. లేదంటే, అప్పుడు మరో వీడియో చేయడానికి గుప్తా  ఇప్పటించే తగిన ‘కంటెంట్’ తో రెడీగా ఉండాల్సి వుంటుంది.


-జాన్‌సన్ చోరగుడి

నిఘా అంటే అది మరీ పెద్ద మాట అవుతుందేమో. అందుకని దాన్ని ఇక్కడ కనిపెట్టడం అంటాను. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలుగు పత్రికల్లో ఇంగ్లీష్ ‘ఎడిటోరియల్ లీడ్ ఆర్టికల్స్’ రాస్తున్న సీనియర్ పాత్రికేయుల తెలుగు తర్జుమా వ్యాసాలు ఇన్నాళ్ళూ ఏ వారం కూడా మిస్సు కాకుండా ‘ఫాలో ‘ అయ్యాను. అందుకు రెండు కారణాలు. మొదటిది - వ్యక్తీకరణలో వాళ్ళు అనుసరించే శైలి గమనించడం కోసం. రెండవది - ఎప్పుడైనా వాళ్ళు నా రాష్ట్రం గురించి ఏమైనా రాస్తారేమో అని. ఎం.జే. అక్బర్ కొన్నాళ్ళు ‘సాక్షి’ కి రాసాక, కేంద్ర మంత్రి అయ్యాక ఆయన రాయడం ఆపేసారు. ఆయన స్థానంలోకి శేఖర్ గుప్తా వచ్చారు. సరే రాజ్ దీప్ సర్దేశాయ్ మొదటి నుంచి ‘ఆంధ్రజ్యోతి’ కి రాస్తున్నారు. 

Latest Videos

undefined

శైలి విషయంగా అక్బర్, శేఖర్ గుప్తా ఉత్సహాన్ని నింపితే, రెండవ అంశంగా మాత్రం ముగ్గురూ నిరుత్సాహమే మిగిల్చారు. చివరికి ఏ ‘కాలమిస్టు’ అయినా విధిగా రాజకీయాలు రాసే ఎన్నికలప్పుడు కూడా... వీళ్ళలో ఎవ్వరూ ఎందుకో ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం రాసేవారు కాదు. కనీసం దీని ప్రస్తావన ఏదోవొక సందర్భంలో ‘క్రాసింగ్ రిఫరెన్స్’ కు కూడా తీసుకునేవారు కాదు. 

వీళ్ళ ఈ ధోరణి - రెండు తెలుగు రాష్ట్రాల విషయంగా కూడా ఒక్కటే! అయితే ఉన్నట్టుండి ఇదొక పెద్ద ఉలిక్కిపాటు! ఏదో బ్రాండ్ సబ్బు టీవీ ప్రకటన మాదిరిగా - ‘అవాక్కయ్యారా..?’ అన్నట్టుగా అంతా జరిగింది ! గడచిన 70 ఏళ్ల లో దక్షణాది రాష్ట్రాల్లో జరిగిన మొదటి రాష్ట్ర విభజనప్పుడు కూడా శేఖర్ గుప్తా ఇలా స్పందించలేదు. అటువంటిది... ‘అమరావతి’ మూడు రాజధానులుగా విస్తరిస్తున్నది అనేసరికి, అది జాతీయ విషాదం అంటూ గుప్తా మొదటి సారి తెలుగు నాట పరిణామాలను ‘నేషనల్ మీడియా ఫ్లాట్ ఫారం’ మీద ప్రతిష్టించే తెగువ చూపారు.

(జర్నలిస్ట్ శేఖర్ గుప్తా)

అయితే, తెలుగునాట రాటుదేలిన జర్నలిస్టుల్లో ఇప్పుడు మాజీలే ఎక్కువమంది, శేఖర్ గుప్తా పుణ్యమా అని వాళ్ళందరికీ ఇప్పుడు చేతి నిండా పని దొరికింది. వాళ్ళంతా ఆ వీడియోలో ఉన్న విషయం “గ్రామర్” వెతుకుతున్నారు, దాని మూలాల అన్వేషణ మొదలెట్టారు. అక్కడ ఆగలేదు, వాళ్ళు తమ నిర్ధారణలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... సీరియస్ చర్చ చేస్తున్నారు.

ఈ హటాత్తు పరిణామంతో ‘అమరావతి’ రాజధాని అంశం మీద ఇన్నాళ్ళూ బయటకు రాకుండా, ‘మెయిన్ స్ట్రీం మీడియా’ ధోరణికి భిన్నమైన అభిప్రాయాలతో ఉన్న ‘మీడియా స్లీపింగ్ సేల్స్’ ఇన్ని ఉన్నాయా అనే విస్మయానికి ఈ వీడియో కారణం అయింది. ఎందుకంటే గడచిన పాతికేళ్లలో వీరంతా తెలుగునాట ‘మీడియా మెంజ్ మెంట్’ లో ఉండే భిన్న పార్శ్వాలను ఔపోసన పట్టినవాళ్ళు! ఇక అస్సలు ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే, తొలుత ‘అమరావతి’ కి ముందు చరిత్ర అయిన ‘తెలంగాణ’ ప్రస్తావన లో శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు గురించి, ఆ తర్వాత వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు గురించిన ప్రస్తావన ఏమాత్రం ఈ వీడియోలోకి తీసుకురాకుండా శేఖర్ గుప్తా చాలా జాగ్రత్త తీసుకున్నారు.

(ప్రొఫెసర్ కేటీ.రవీంద్రన్)

అందుకు ఆయన చాలా వెనక్కి వెళ్లి వాజపేయి స్వర్ణ చతుర్భుజి మధ్య ‘గూగుల్’ మ్యాప్ మీద చతురస్రం గీస్తూ డిల్లీ - కలకత్తా – చెన్నై – బొంబాయిల మధ్య ఇప్పుడు ‘అమరావతి’ పేరుతో మరో ‘మెగా సిటీ’ నిర్మాణం జరగపోతే ఎలా? అంటూ తాను చేయాలనుకున్న వాదనకు వొక విస్త్రుతమైన భూమికను సిద్దం చేసుకున్నారు. ఈ పద్దతి ఎంచుకోకపోతే, శేఖర్ గుప్తా విధిగా ప్రొ. కె,టి. రవీంద్రన్ అభిప్రాయం తీసుకుని అప్పుడు మాత్రమే ఆయన ‘అమరావతి’ గురించి మాట్లాడవలసి ఉంటుంది.

శివరామకృష్ణన్ కమిటీలోను జి.ఎన్. రావు కమిటీలోను ఉన్న యు.ఎన్. కు కూడా కన్సల్టెంట్ గా ఉన్న ఈ డిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ వివరణ కూడా శేఖర్ గుప్తా తన వీడియోలో ‘రికార్డు’ చేయాల్సి ఉంటుంది. అలా  చేస్తే, రవీంద్రన్ చెప్పేది సత్యం అయినా తను చెప్పాలని  ముందుగానే నిర్ణయించుకున్న దానికి అది భిన్నం అవుతుంది.

కనుక, ముందే మనం దాన్ని ‘అవాయిడ్’ చేయాలి, బొత్తిగా దాన్ని మనం పట్టించుకోవలసిన అవసరం లేదు! వొక ‘అర్బన్’ లేదా ‘మెట్రో’ కాలమిస్ట్ గా ఉండాలనుకునే వొక జర్నలిస్టు తాను చేయాలనుకున్న వార్తా వాదనకు ‘టేకాఫ్’ ఎలా తీసుకోవాలి? అనేదానికి ఈ వీడియో వొక ‘క్లాసిక్’ ఉదాహరణ! ఇందులో ‘చరిత్ర’ లేదు, ‘జాగ్రఫీ’ లేదు, ‘సోషయాలజీ’ లేదు! వెరసి –మనష్యులు లేరు. నిజానికి మరొకరు ఎవరైనా ఇటువంటి వీడియో చేసుంటే, దీన్ని ‘పేజ్ త్రీ’ వీడియో న్యూస్ స్టోరీకి ‘క్లాసిక్’ మోడల్ అనొచ్చు.

ఏ మాత్రం వెరవకుండా హైదరాబాద్ అన్నప్పుడు చార్మినార్ ‘విజువల్’ చూపించినట్టుగానే, ‘అమరావతి’ అన్నప్పుడు గ్రాఫిక్ డిజైన్ నగరం చూపించారు. ఆ చిత్రం క్రింద కనీసం ‘ఇమేజినరీ’ అని రాసే ‘విజువల్ జర్నలిజం’ నైతిక ప్రమాణాలు శేఖర్ గుప్తా సంస్థ ‘ది ప్రింట్’ పాటించలేదు. విదేశాల్లో ఉంటూ ఈ వీడియో చూసేవారికి, జగన్ నిర్ణయంతో ఇప్పుడు పోటోలో కృష్ణా నది మీద ఉన్న ఆ ‘ఐకాన్ బ్రిడ్జి’ ఇక తుప్పు పట్టడమేనా? అనే దిగులు కలగక మానదు! కానీ అది శేఖర్ గుప్తా చేసిన వీడియో కావడం వల్ల గబుక్కున మనం ఏమీ అనలేం. పోనీ దాన్ని అలా వదిలేద్దాం.

ఆశ్చర్యంగా ‘అమరావతి’ అంశంలో ఎక్కడా భారత ప్రభుత్వం ఊసు కూడా లేదు! ‘వీడియో’ నిడివి ఎంత వుందో గమనించలేదు, కానీ గడచిన ఐదేళ్ళలో అక్కడ జరిగిన నిర్మాణ పనుల్లో యూనియన్ – ఫెడరల్ ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన లేదా జరగాల్సిన ‘ప్రొసీజర్’ వ్యవహారాలు గురించి ఎందుకో గుప్తా పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. అందుకోసం ఆయన కేంద్ర హోం శాఖకు, అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వశాఖలకు అవి చేయాల్సిన సమీక్షల బాధ్యతల నుంచి తనకు తానే మినహాయింపు ఇచ్చేసారు! కేంద్ర నిధులు రాజధాని నిర్మాణం కోసం అప్పుగా తెచ్చిన డబ్బు ఎలా ఖర్చు అవుతున్నది, అనేది ఆయనకు అవసరం లేని విషయం అయింది.

కేంద్ర – రాష్ట్ర సంబంధాల్లో కొత్తగా ‘ విదేశీ (రియాల్టీ) వాణిజ్యాన్ని కేంద్రం ఎప్పుడు ఏ.పి. ప్రభుత్వానికి అప్పగించింది అనే అనుమానం, ఎందుకో ఆయనకు రాలేదు. అందుకే జగన్ ‘అమరావతి’ ని వదిలిపెట్టడం దారుణం అంటున్నారు. పోనీ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మొదటి సి.ఎం చెంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టిన ‘స్టేట్ రియాల్టీ ట్రేడ్’ ను భారత ప్రభుత్వం అధికారికమని ఎప్పుడు ఆమోదించిందో, దాన్ని జగన్ ప్రభుత్వం యధావిధిగా కొనసాగించకపోతే, అది ఎలా కేంద్ర నిబంధనల అతిక్రమణ అవుతుందో గుప్తా చెప్పలేదు. అది కనుక ఆయన చెప్పి ఉంటే, జగన్ ప్రభుత్వం ముందున్న సమస్య చాలా వరకు తేలిక అయ్యేది.

ఇదంతా కాదు. పోనీ నలభై ఏళ్ల ప్రాంతీయ పార్టీకి ‘మెట్రో మీడియా మొఘల్స్’ తో ఉండే మొహమాటాలు లేకుండా ఎలా ఉంటాయిలే, అని మనం అనుకున్నా, శేఖర్ గుప్తా వంటి మాజీ ఎడిటర్ కు భారత్ కు ఆగ్నేయాన తూర్పు తీరంలో  ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో; ఏ.పి. ‘ఎగ్జిక్యూటివ్ కేపిటల్’ ఎటువంటి ‘స్ట్రాటజిక్ పాయిట్’ లో ఉండాలో గ్రహింపు లేదు అనుకోవడం ఎందుకో నమ్మశక్యంగా లేదు.

మెడ్రాస్ కు కంటోన్మెంట్ ఉంది. బెంగుళూరుకు కంటోన్మెంట్ ఉంది. మరో తొమ్మిదేళ్ళు అక్కడ ఉండే హక్కు వున్నప్పటికీ విభజన జరిగిన ఏడాదికే ఏ.పి. విడిచివచ్చిన హైదరాబాద్ కు మిలటరీ కంటోన్మెంట్ ఉంది. మరి ‘అమరావతి’ రాజధాని నగరానికి అటువంటి మిలటరీ కంటోన్మెంట్ దన్ను శేఖర్ గుప్తా ఎందుకు అక్కరలేదు అనుకున్నారో మనకు తెలియదు. ఆయన కూడా చెప్పలేదు. పోనీ బ్రిటిష్ కాలం నుంచి విశాఖపట్టణం లో ఉన్న ఈస్ట్రన్ నావల్ కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కొన్ని ప్లేటూన్స్ ‘అమరావతికి’ తరలించడానికి అవకాశాలు లేవన్న సంగతి ఆయనకు తెలియదు అని మనం అనుకోలేము.

తన సుదీర్ఘ అనుభవంలో నుంచి డెబ్బై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం సాగుతున్న తీరును శేఖర్ గుప్తా చాల గొప్పగా  సూత్రీకరించారు. “మన నాయకులు గ్రామాల్లో జనంతో వోట్లు వేయించుకుని, వాళ్ళు నగరాల్లో డబ్బును ‘మింట్’ చేస్తున్నారు” అంటూ తనదైన శైలిలో ఆయన సూటి వ్యాఖ్యను చేసారు. వెంటనే, దేశంలో ఎక్కడ కెళ్ళినా ఆంధ్రులు ‘ఎంటర్ ప్రెన్యూర్లు ‘ గా కనిపిస్తూ ఉంటారని, వాళ్ళు ‘ఎంటర్ ప్రెన్యూర్లు ‘ కాదు ‘ఆంధ్ర ప్రేన్యుర్లు’ అంటూ గుప్తా చమత్కరించారు. అలా ఆయన ఇక్కడ కొందరు పారిశ్రామికవేత్తలకు ఆనందం కలిగించాలని కూడా అనుకున్నట్టున్నారు.

 

నిజానికి తెలుగు పారిశ్రామికవేత్తల గురించి శేఖర్ గుప్తాకు ఉన్న సదభిప్రాయానికి మనం ఆయనకు కృతఙ్ఞతలు చెప్పాలి. కానీ... గత డెబ్బై ఏళ్లుగా తెలుగు రాజకీయాలకు గుండెకాయ అని చెప్పుకునే ‘కృష్ణా – విజయవాడ’ ప్రాంతం పారిశ్రామికంగా ‘జీరో’ ఎందుకు అయిందో తెలియకుండా, వీడియోలో చెప్పకుండా ఇప్పుడు కేవలం ‘అమరావతి’ గురించి మాత్రమే నేను మాట్లాడతాను అంటే, ఇక్కడ ఆయన్ని ఎవ్వరూ అంగీకరించరు.

అయినా ఎనభయ్యో దశకంలో పెళ్ళిళ్ళు చేసుకున్న చాలా మంది భారతీయులకు ఉన్న సమస్యే శేఖర్ గుప్తాకు కూడా ఉన్నట్టు, ఆయన అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు అనీ, ఇప్పుడు ఆయన ‘వీడియో’తో ఏ.పి. ప్రభుత్వం మీద చేయిచేసుకున్న తర్వాత వెల్లడయింది.

(గోల్ఫ్ ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి)

ఏమిటి ఆ సమస్య? అది పాఠాలు చెప్పేటప్పుడు - ‘జెనరేషన్ గ్యాప్’ సోయ లేకపోవడం! దేశంలోనే అతి చిన్న వయస్సున్న ముఖ్యమంత్రి, అదీ ‘పొలిటికల్ పవర్’ పొరలు (లేయర్స్) లెక్క తెలిసిన కాంగ్రెస్ కుటుంబంలో నుంచి స్వంత పార్టీ ద్వారా జనరంజక తీర్పుతో అధికారంలోకి వచ్చిన ‘ఎంటర్ ఫ్రెన్యుర్’ సి.ఎం. చర్యల్ని; తాను తప్పు పడుతున్న విషయం గుప్తా గమనంలోకి తీసుకోలేదు. గుప్తా ఇప్పటికే నోరుజారినట్టుగా జగన్ మూడు రాజధానులు ; “తుగ్లక్” నిర్ణయం కనుక అయితే, రాష్ట్ర ప్రజలు ‘ఉగాది’ ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో ఈ వీడియో చూసాక ఎటూ గుప్తాకు వోటు వేస్తారు. లేదంటే, అప్పుడు మరో వీడియో చేయడానికి ఆయన ఇప్పటించే తగిన ‘కంటెంట్’ తో సిద్దంగా ఉండాల్సివుంటుంది. 

click me!