నెహ్రూ టు మోడీ: డెబ్బై ఏళ్ల భారత క్రైస్తవ సమాజ పయనం...

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 5:44 PM IST
Highlights

‘బైబిల్’ ను దైవ వాక్యంగా విశ్వసిస్తున్న సమూహాలను ‘చర్చి’ తన ఆచారాలు పేరుతో ఎప్పటికీ తన నియంత్రణ లోనే ఉంచుకోవాలని అనుకుంటే, చరిత్ర ఆగదు. దాని ప్రమేయం లేకుండానే... తగిన పరిష్కారాలు ‘చర్చి’ బయట, బైబిల్ ను విశ్వసిస్తున్న భారతీయ సమాజం కూడా వెతుక్కుంటుంది

- జాన్ సన్ చోరగుడి

మరో నెల తర్వాత 2020 దశకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అప్పట్లో తొంభైల నించి మనం 2000 లోకి వచ్చినప్పుడు, ఒక నూతన సహస్రాబ్ది జ్వరం... మనల్ని అందర్నీ మనం ఏదో వొక కొత్త మహాత్తులోకి ప్రవేశిస్తున్నట్టుగా... ఊగించింది! మొదటి దశకం సోనియా నాయకత్వంలో యు. పి.ఎ. పాలన; రెండవ దశకంలో మోడీ-షా ల ద్వయం ఎన్.డి.ఎ. పాలన రెండు చూసాం...  ఇప్పటికీ ఇంకా చూస్తున్నాము. క్రైస్తవ సమాజ సంబంధిత అంశాలు, వాటి మంచిచెడులు కూడా ఈ రెండు దశాబ్దాల కాలంలో మనం చూసాం.

యు.పి.ఎ. కాలంలోనే మన దేశంలో పనిచేస్తున్న క్రైస్తవ సంస్థలకు విదేశాలనుంచి వచ్చే నిధుల మీద ఆంక్షలు మొదలయ్యాయి. అటువంటి అంక్షలు, నియంత్రణా చర్యలు అన్నీ గడచిన రెండు దశాబ్దాలలో పూర్తి స్థాయిలో అమలు అయ్యాయి. ఈ కాలంలోనే గతంలో విదేశీ నిధులతో స్వతంత్ర సువార్తికులుగా (ఇండిపెండెంట్ చర్చి) ప్రచారంలోకి వచ్చిన వారి ప్రచార హోరు ఇప్పుడు విసుగు కలిగించే స్థాయికి చేరింది! వీరిలో కొందరు టి. వి. చానళ్లలో సువార్త అంటూ... భారతీయ క్రైస్తవ సమాజ క్లిష్ట స్థితిని పెనం మీది నుంచి పొయ్యిలోకి దించారు.

గతంలో కాంగ్రెస్ ప్రసిడెంట్ సోనియా గాంధీ ఇటలీ క్రైస్తవ మహిళ కనుక, ఆమె కాలంలో తమకు మేలు జరుగుతుంది అని ఆశలు పెట్టుకున్నవారికి నిరుత్సాహమే మిగిలింది. క్రైస్తవ సమాజ డిమాండ్లలో అన్నిటికంటే ప్రధానమైన, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అంశం అన్నింటికంటే ప్రధానమైనది. అయితే 75 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ప్రధానంగా తెలుగు క్రైస్తవ సమాజాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేసింది. సమస్య స్వభావం పరిష్కారానికి అనువుగా లేనప్పుడు, అది సోనియా అయినా మోడీ అయినా అంతకు ముందున్న తెలుగు ప్రధాని పి. వి. అయినా ఎవ్వరూ కూడా చేయగలిగింది ఏమీ లేదు అనే విషయం, గడచిన రెండు దశాబ్దాల కాలం నిరూపించింది. 

ఇందుకు సంబంధించిన సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి (జీసస్ చాలు, ‘మతం’ వద్దు అంటున్న గాంధీ మార్గం!) ఇప్పుడు కూడా... ఈ పాత విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం ఎందుకు అన్నప్పుడు, 2019 డిసెంబర్లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మతమార్పిడి బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతున్నది. అదే కనుక జరిగితే భారతీయ క్రైస్తవ సమాజం దాన్ని ఎలా స్వీకరించవలసి వుంటుంది... అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. 

ఈ అంశం మీద గతంలో కేంద్రం నియమించిన జస్టిస్ జగన్నాధ మిశ్రా కమీషన్ నివేదిక, ఈ డిమాండ్ కు అనుకూలమైనప్పటికీ, అది పార్లమెంట్ ముందుకు రాకపోవడానికి కారణం, అ నివేదికలో కమీషన్ సెక్రటరీ చేసిన ఒక అభ్యంతరం( Dissent Note) కారణం. అయితే అందుకు ‘భారతీయ చర్చి’ కారణం అయింది. అయితే, ఈ విషయం మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి నవంబర్ 14 సందర్భంగా మరో సారి మనం గుర్తు చేసుకోవలసి వుంది. 

 

బ్రిటిష్ పాలకులు మన దేశం విడిచి వెళ్ళిన వెంటనే మన దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జవహర్లాల్ నెహ్రు అంటే భారతీయ క్రైస్తవ సమాజానికి ఎనలేని గౌరవం, అభిమానం. కారణం ఆయన లౌకిక దృక్పధం. అయన జీవన శైలి సైతం ఎంతో ఆధునికంగా వుండేది. దానిపై పాశ్చ్యాత్య నాగరిక ప్రభావం స్పష్టంగా కనిపించేది. అప్పటికే ప్రజాస్వామ్య దేశాల్లో అమలులో ఉన్న ‘పబ్లిక్ పాలసీ’ ని అవగాహన చేసుకుని, మన దేశపు ‘సెక్యులర్’ విధానానికి పునాదులు నిర్మించినవాడు నెహ్రు.

ప్రధానిగా 17 ఏళ్ళ సుదీర్ఘ కాలలో నెహ్రు మన దేశంలో విద్య, వైద్య రంగాల్లో విదేశీ మిషనరీల సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. అందుకోసం, అయన స్థానిక ఇండియన్ చర్చి పాలకవర్గాలతో చివరి వరకు సుహుర్ధ్భావ సంబంధాలు కొనసాగించారు. అయితే, వేల ఏళ్ళుగా సనాతన హైందవ ధార్మిక మూలాలు పాతుకుపోయి ఉన్న భారతీయ సమాజం గురించి నెహ్రుకు వున్న లోతైన స్పృహ బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. అవసరం అయినప్పుడు తప్ప దాన్ని అయన కూడా బయటకు తెలియనివ్వలేదు.

 

ప్రధాని జవహర్లాల్ నెహ్రు 1957 లో స్వీడన్ సందర్శించారు. స్వీడన్ రాజు మన ప్రధాని జవహర్లాల్ నెహ్రు గౌరవార్ధం విందు సమావేశం ఏర్పాటు చేసారు. అ సందర్భంగా స్వీడన్ రాజు నెహ్రు ముందు ఒక కొత్త అంశం లేవనెత్తారు.

‘ఇండియాలో ప్రస్తుతం 300 మంది స్వీడన్ క్రిష్టియన్ మిషనరీలు పనిచేస్తున్నారు. అయితే భారత దేశ విధానాలు (పాలసీలు) వారి పనికి అవరోధంగా ఉన్నాయి. నిజానికి వాళ్ళు అక్కడ ఎంతో ప్రసంసనీయమైన సేవలు అందిస్తున్నారు....’ అన్నారు.

‘నేను ఇండియా నుంచి ఒక 1000 మంది హిందూ మిషనరీలను స్వీడన్ పంపితే ఏమవుతుంది?’  

అంటూ నెహ్రు స్వీడన్ రాజు సంభాషణను మధ్యలోనే అడ్డుకున్నారు. 

నెహ్రు ఇలా వివరించారు...

‘ఇది రాజకీయంగా సున్నితమైన అంశం. ప్రస్తుతం ఇండియాలో 5,700 మంది విదేశీ మిషనరీలు పనిచేస్తున్నారు. విదేశీ మిషనరీలు ఇంకా భారత దేశంలో పనిచేయడాన్ని మేము అనుమతించం. ఆ పని ఏదో ఇండియన్ క్రిష్టియన్ మిషనరీలను చేయనివ్వండి. ఇది కేవలం రాజకీయమైన అంశమే కాదు, సాంస్కృతికమైనది కూడా...’ 

అప్పట్లోనే నెహ్రు స్వీడన్ రాజుకు ఇలా...ధీటైన సమాధానం ఇచ్చారు. 

ఈ పూర్వ రంగంలో 2020 నాటికి భారత ప్రభుత్వం మతమార్పిడి అంశాన్ని సమీక్షించి, దాని మీద ఆంక్షలు అమలు చేయాలని కనుక అనుకొంటే, ఈ అంశాన్ని  ‘నెహ్రు టు మోడీ’ అనే దృష్టితో చూసినప్పుడే మనకు గడచిన ఏడు దశాబ్దాల పరిణామాలు అర్ధమవుతాయి. విషయానికి ఉన్న అన్ని పార్శ్వాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ దృష్టితో దీన్ని చూడడం వల్ల ఏదో ఒక రాజకీయ పక్షానికి అది మేలు కావొచ్చు గాని, భారతీయ క్రైస్తవ సమాజనికి మాత్రం ఎంతమాత్రం ప్రయోజనం ఉండదు.

చరిత్రలోకి ఒకసారి వెనక్కి చూస్తే.... సందర్భం వచ్చిన ప్రతిసారీ ‘గతానికి’ సంస్కరణ జరిగినప్పుడే, చరిత్ర మృదువుగా ముందుకు సాగింది. ‘బైబిల్’ ను దైవ వాక్యంగా విశ్వసిస్తున్న సమూహాలను ‘చర్చి’ తన ఆచారాలు పేరుతో ఎప్పటికీ తన నియంత్రణ లోనే ఉంచుకోవాలని అనుకుంటే, చరిత్ర ఆగదు. దాని ప్రమేయం లేకుండానే... అది తగిన పరిష్కారాలు ‘చర్చి’ బయటే, బైబిల్ ను విశ్వసిస్తున్న భారతీయ సమాజం వెతుక్కుంటుంది.

‘వోపెన్ చర్చి’ వొక సరి కొత్త ‘థీం’ గా... రాబోయే కాలానికి ఒక పరిష్కారంగా వేగంగా విస్తరించడం ఇప్పటికైనా మనం గమనించడం అవసరం.

Also Read:

కేపిటల్ ‘మానియా’ ఇక చాలు: దృష్టి తీరానికి చేరాలి

click me!