సంక్రాంతి వచ్చిందే తుమ్మెద

First Published Jan 12, 2018, 1:09 PM IST
Highlights
  • తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పండగ వాతావరణం
  • అన్ని పండగలలోకెల్లా పెద్ద పండగ సంక్రాంతి

‘‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతంటే..’’ ఈ పాట అందరూ వినే ఉంటారు. సంక్రాంతి పండగ మొత్తాన్ని తెలియసే అద్భుతమైన పాట ఇది. మనకు చాలా పండగలు ఉన్నప్పటికీ.. వాటిలో ‘సంక్రాంతి’ మాత్రం చాలా ప్రత్యేకం.ఏడాదిలో వచ్చే తెలుగు దనపు తొలిపండుగ. అందుకే సంక్రాంతిని గానంచేయని కవి లేడు తెలుగు నాట. 

 అన్ని పండుగలలో కెల్లా ఇది పెద్ద పండగ.  భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో.. మూడు రోజులపాటు ఈ పండగను జరుపుకుంటారు. చదువు, ఉద్యోగాల రిత్యా.. ఎక్కడెక్కడో స్థిరపడినప్పటికీ.. ఈ సంక్రాంతి పండగకు మాత్రం అందరూ.. సొంతూళ్లకు పయనమవుతారు. ఏ పండగకు వెళ్లినా వెళ్లకపోయినా.. సంక్రాంతి మాత్రం సొంత ఊరిలోనే జరుపుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కీనసం మూడు నాలుగు నెలల ముందు నుంచే బస్సు, రైలు టికెట్లు బుక్ చేసేసుకుంటారు. అందరూ ఇంత ప్రాముఖ్యతను ఇచ్చే సంక్రాంతి పండగను పూర్వం తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుపుకునేవారో ఒకసారి చూద్దామా...

మన భారతదేశం  వ్యవసాయాధారిత దేశమన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సంక్రాంతి పండగకి కూడా వ్యవసాయంతో సంబంధం ఉంది. జనవరి రెండో వారంలో రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. ఆ సమయంలో జరుపుకునేదే ఈ సంక్రాంతి పండగ. అంతేకాదు.. ఈ పండగకి సూర్యుడితో కూడా సంబంధం ఉంది.సూర్యుడు ఒకరాశి నుంచి మరొకరాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు .  

తెలుగు రాష్ట్రాలలోనే కాక దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాలుగు రోజుల పండగ . మొదటి రోజు భోగి , రెండవ రోజు సంక్రాంతి , మూడవరోజు కనుమ , నాలుగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ధనుస్సంక్రమణం నుంచే ప్రారంభమవుతుంది ఈ పండగ . ఇప్పుడంటే.. అన్ని అపార్ట్ మెంట్ సంస్కృతులు వచ్చి.. ఎవరూ ముగ్గులు అనేవి వేయడం లేదు. కానీ..  ఒక్కప్పుడు మాత్రం నెల మొత్తం ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి.. రంగులు అద్దేవారు. ఇప్పటికీ పల్లెల్లో మహిళలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి.. వాటిపై ఆవుపేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పెడతారు. బంతి పూలతో ముగ్గులపై అలంకరిస్తారు. ఉదయాన్నే హారిదాసులు పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతారు.



ఈ సంక్రాంతి పండగ మొదటి రోజైన భోగి నాడు తెల్లవారుఝామున భోగి మంటతో రోజు మొదలవుతుంది , మంటలో నానారకాలయిన కర్రలను , యింట్లో పనికిరాని వస్తువులను , పిడకలను కాల్చడం చేస్తారు . ఈ సమయంలో వాతారణం చల్లగా ఉంటుంది కాబట్టి.. ఆ భోగి మంట వద్ద అందరూ చలికాచుకుంటారు.  తరవాత అభ్యంగన స్నానం , కొత్తబట్టలు  ధరిస్తారు. ఈ పండగలో మరో విశేషం కూడా ఉంది. కొత్త అల్లుళ్లు  అత్తవారింటికి వచ్చి కానుకలు అందుకుంటారు.

 సాయంత్రం ఇంట్లో వున్న చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ముద్దముద్దుగా వుండే చిన్న పిల్లలకు దృష్టి దోషాలు తొలగి పోవాలని రేగిపండ్లు , చెరుకు ముక్కలు , తీపి పదార్ధాలతో తలపైనుంచి పొయ్యడమే భోగి పళ్లు పొయ్యడం . భోగితో మొదలుపెట్టి మూడురోజులు బొమ్మల కొలువు పెడతారు . సంక్రాంతి నాడు కొత్త బెల్లంతో చేసిన పరమాణ్ణం నైవేద్యంచేసి కొత్తబట్టలు , పసుపు కుంకుమ , చెరుకు , సంక్రాంతి పురుషునికి ధారపోయడం చేస్తారు . ముత్తైదువలు పసుపు కుంకుమ ఒకరికొకరం యిచ్చుకుంటారు . పిల్లలు గాలిపటాలు పోటీ పడి యెగురవేస్తారు . కొన్ని ప్రాంతాలలో సంక్రాంతినాడు మరణించిన వారికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు . దీనిని ' పెద్దలను పిలవడం ' అని వ్యవహరిస్తారు.

ఇక కనుమ రోజు యేడాది పొడవున మనకు పాలిచ్చి , రైతులకు సహాయంగా నిలిచిన పశువులకు అలంకరించి పూజలు చేస్తారు. ఇవి కాక.. ఏపీలో ప్రత్యేకంగా కోడిపందేలు నిర్వహిస్తారు. అసలు పండగ వాతావరణం    అంటే ఇక్కడే కనపడుతుంది. అయితే.. వీటి నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుంటాయి. అయినప్పటికీ చాటుమాటుగా ఇవి జరుగుతూనే ఉంటాయి.

click me!