ది హిందూ కార్టూనిస్ట్ సురేంద్రకు ‘‘ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు’’

By Siva Kodati  |  First Published Aug 22, 2022, 8:33 PM IST

ది హిందూ కార్టూనిస్ట్ సురేంద్రకు 2022 సంవత్సరానికి గాను కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు దక్కింది. శేఖర్ కుటుంబ సభ్యుల తరుపున ఆయన కుమారుడు నందు.. సురేంద్రకు సన్మానం చేసి అవార్డును బహూకరించారు. 


పొలిటికల్ కార్టూన్ అనగానే శేఖర్ తప్పకుండా గుర్తుకు వస్తారని... ఆయన కార్టూన్లకు ఆ శక్తి వుందన్నారు ది హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర. 2022 సంవత్సరానికి గాను కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డును ఆయన అందుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, పదివేల రూపాయల నగదును బహూకరించారు. శేఖర్ కుటుంబ సభ్యుల తరుపున ఆయన కుమారుడు నందు.. సురేంద్రకు సన్మానం చేసి అవార్డును బహూకరించారు. 

అనంతరం సురేంద్ర మాట్లాడుతూ.. కార్టూనిస్ట్‌గా మాత్రమే కాకుండా ఒక ఆర్గనైజర్‌గా, యాక్టివిస్ట్‌గా, రచయితగా శేఖర్ బహుముఖ పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. శేఖర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డు.. తనకు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డు కంటే చాలా గొప్పదని సురేంద్ర వ్యాఖ్యానించారు. శేఖర్‌తో జర్నీ బాగుంటుందని.. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారని ఆయన గుర్తుచేశారు. సాక్షి కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ.. కార్టూన్లు ఎలా గీయాలో శేఖర్ దగ్గరే నేర్చుకున్నామని గుర్తుచేసుకున్నారు. తమ టీం అందరినీ వెంటపెట్టుకుని యాక్టివ్‌గా కార్యక్రమాలు చేసేవాడని.. తెలుగులో కార్టూనిస్ట్‌ల్లో అత్యధిక కార్టూన్ల పుస్తకాలను ప్రచురించింది శేఖరేనని శంకర్ ప్రశంసించారు. 

Latest Videos

సీనియర్ కార్టూనిస్ట్ నర్సిం మాట్లాడుతూ.. కొత్త విషయం నేర్చుకోవడానికి శేఖర్ చాలా తాపత్రయపడేవారన్నారు. ఫోటోషాప్ వచ్చిన కొత్తలో దానిని నేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. మరో కార్టూనిస్ట్ మృత్యుంజయ మాట్లాడుతూ.. బ్యాంక్ బాబు అనే కార్టూన్ల పుస్తకంతో శేఖర్ కొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. తన సతీమణి చంద్రకళకు శేఖర్ చదువు, కంప్యూటర్ నేర్పించి ఆమెతోనూ పుస్తకం రాయించారని మృత్యుంజయ కొనియాడారు. వీరితో పాటు సీనియర్ కార్టూనిస్ట్‌లు నారు, రాకేష్, అవినాష్, జేవీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

click me!