నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన కవిత ' శ్రీశ్రీ సంతకం ' ఇక్కడ చదవండి :
'మరో ప్రపంచం... మరో ప్రపంచం...'
మళ్లీ ...మళ్లీ ఈ మాట
వినపడుతూనే వుంది
చూద్దామని ఒక్కసారి తలుపు తట్టాను
వెంటనే ద్వారాలు తెరుచుకున్నాయి
ఆహ్వానిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానం
చూస్తున్న నా నేత్రాల నిండా
లక్ష టన్నుల ఆశ్చర్యం...
నమ్మలేని నిజాలు, సాక్షాల సంతకాలతో
కవాతు చేస్తూ నిలబడ్డాయి
ధగ, ధగలాడే ఆ మరో ప్రపంచంలో....
అన్నిదేశాల తలరాతల్ని
చెమట చుక్కలే రచిస్తున్నాయి
పాలకులెవరూ లేరక్కడ
ఉన్నదంతా సేవకులు మాత్రమే
ప్రజల అందరి శిరస్సు మీద
త్యాగాల తలకట్టులు...
నిత్యం పరిమళించే మట్టివాసన
ప్రాణవాయువు అవుతుందక్కడ....
శిక్షలు, నేరాలు, ఘోరాలు, ఉరితీతలు
సమస్తం సమాధుల్లో శాశ్వతంగా విశ్రాంతి
భూమికి భారమైన బద్ధకం
రోజూ బ్రద్ధలవుతున్న దాఖలాలు
కులం, మతం, వర్గం, వర్ణాలు
కలిసికట్టుగా ఆవిరైపోతున్న దృశ్యాలు
గణ, గణమని గంటలు గుడుల్లో కాదు
గుండెలు మాట్లడుకుంటున్న మందిరాలలో
మనిషిని, మనిషి హత్తుకున్నప్పుడు
వినిపించేది లబ్ డబ్ శబ్దాలు కాదు
నేను, నీకు ఉన్నానంటూ
భుజంతట్టి ఇచ్చే భరోసాలు
మనిషి నిలబడితే చాలు..
మానవత్వం నిచ్చెనతో
ఆకాశం సైతం అందుతోంది
మంచితనం కొలతల్లో...
కొలతలకు అందని ఎత్తులు అందరివి
దోచుకుని, దాచుకోవటం తెలియని
జనం వొంటినిండా...
అన్నీ మంచితనం అంగవస్త్రాలే
త్యాగాల జాతరలో మనిషి, మహోత్తరంగా
వెలగటం ప్రారంభించాక
ఆకాశం ఆరు వరుసల రహదారులై
నక్షత్రాలను వీధి దీపాలుగా నిలబెడుతోంది
నిత్యం శాంతిగీతాలతో
అన్ని దేశాల నిండా ప్రగతి పాటకచేరీలు
ఎత్తి బిగించిన పిడికిళ్ళకు అడుగడుగున
కాలం చేసే సాష్టాంగ నమస్కారాలు
మానవత్వానికి మామిడాకులు కట్టిన
ఆ మరో ప్రపంచంలోకి ....
మనసును హారతులు చేసి
నేనూ అడుగులు వేస్తున్నాను ....
నా తలరాత గీతల మీద
క్రొత్త రాతలు రాస్తూ జయభేరి గీతాలు
మానవాళి మరోచరిత్ర కోసం
దారినిండా పరచిన
సమానత్వం తివాసీలమీద
నా అడుగులు, పరుగులయ్యాక
నా చేతిని పిడికిళ్లుగా మూరుస్తూ
భుజం తట్టిన శ్రీశ్రీ సంతకం