పవన్ దృష్టి పెట్టాల్సింది ఈ అంశాల పైనే!

First Published Oct 19, 2017, 11:00 AM IST
Highlights

నీకున్న కరిష్మా, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కారణంగా లక్షలసంఖ్యలో  ప్రజలు  జనసేన ప్రయోగంలో పాలుపంచుకుంటున్నారు. నువ్వు ఏమాత్రం తప్పటడుగులు వేసినా దాని పర్యవసనాలు నువ్వు ఒక్కడివే కాదు, లక్షలమంది అనుభవిస్తారని గుర్తుపెట్టుకోవాలి

అధికారం పరమావధికాదు, ప్రజాసమస్యలపై ప్రశ్నించటం కోసం అంటూ రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల యువత గణనీయసంఖ్యలోనే ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. నవరాజకీయం రావాలని, నిష్కళంకమైన పాలన కావాలని కాంక్షిస్తున్న యువతీయువకులకు పవన్ జనసేన ఆశాకిరణంలాగా కనపడటమే దీనికి కారణం. అట్టడుగు స్థాయినుంచి అత్యున్నతస్థాయి ఉద్యోగాలలో ఉన్నవారిదాకా, ఇంకా చెప్పాలంటే విదేశాలలోఉన్నవారు కూడా చాలామంది పవన్ వెంట నడవటానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు, పవన్ గానీ, ఆయన బృందంగానీ ఏమీ చెప్పకపోయినా తమ తమ ప్రాంతాలలో స్వచ్ఛందంగా, తపనతో అనేక సేవాకార్యక్రమాలను, వితరణ కార్యక్రమాలను నిర్వహించేవారి సంఖ్యకూడా తక్కువేమీకాదు. ఈ జనసైనికులు పవన్ ను ఎవరైనా పరుషంగా ఒక్కమాట అంటే చాలు తమకు అందుబాటులోఉన్న సోషల్ మీడియాద్వారా, ఇతర మార్గాలద్వారా వాళ్ళమీద యుద్ధాలు ప్రకటిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వీరంతా ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ ఇంతవరకూ పార్టీ నిర్మాణమే జరగని, ద్వితీయశ్రేణి నాయకత్వమే లేని, స్పష్టమైన కార్యాచరణ కనబడని, తమ స్వరం వినిపించటానికి సొంత మీడియా ఊసే ఎత్తని ఈ 'జనసేన'తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయోగం రాబోతున్న ఎన్నికలలో విఫలమైతే - ఆ పార్టీకోసం తపనపడుతున్న, చెమటోడుస్తున్న, ప్రాణాలు ధారపోస్తున్న ఈ యువతీ యువకుల గుండెలు బద్దలవుతాయన్న సంగతి ఆ అభినవ చేగువేరాకు తెలుసా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం. ఈ ప్రశ్న ఊహాజనితం(hypothetical) అనిపిస్తున్నప్పటికీ అసంబద్ధంమాత్రం కాదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీలో ఎన్నోప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటొకటిగా చూద్దాం.

 

 

1. పార్టీ నిర్మాణం: చంద్రబాబునాయుడుపై పవన్ చేసే ఒక ప్రధాన విమర్శ... ఆ మాటకొస్తే పవనే కాదు చంద్రబాబుకు దగ్గరివాళ్ళు అని చెప్పుకోదగ్గ వడ్డే శోభనాద్రీశ్వరరావు, జయప్రకాష్ నారాయణ కూడా చేస్తున్న విమర్శ ఏమిటంటే - డీ  సెంట్రలైజేషన్. నాడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధినంతా హైదరాబాద్ లోనే చేసి మిగతా రాష్ట్రాన్నంతా గాలికొదిలేశారని, అలాగే ఇప్పుడు కూడా అమరావతిపైనే దృష్టిపెట్టి మిగిలిన రాష్ట్రాన్ని పట్టించుకోవటంలేదని వీరందరూ విమర్శించారు. అయితే విచిత్రమేమిటంటే ఇదే పవన్ తన పార్టీలో కూడా అదే తప్పు చేస్తున్నారు. పార్టీ మొత్తం ఒన్ మేన్ ఆర్మీలాగా నడుస్తూ ఉంటుంది. దీనిపై ఒకసారి విలేకరులు ప్రశ్నించగా, ప్రజారాజ్యం ప్రయోగం నేపథ్యంలో పార్టీ నిర్మాణం జరపటంలేదని పవన్ చెప్పారు. కానీ గతంలో విఫలమైన కారణాన ఒక రాజకీయపార్టీని సక్రమంగా నిర్మించటం అసాధ్యమనే ఒక నిర్ణయానికి వచ్చి కాడిపారేయటం సరికాదని కూడా పవన్ కు తెలియకపోవటం విచారకరం. ఒక రాజకీయపార్టీ అన్నాక ఒక కోర్ కమిటీ(లేదా పోలిట్ బ్యూరో)ని, ఒక థింక్ ట్యాంక్ ను, మహిళ, విద్యార్థి, కార్మిక, రైతు, దళిత వంటి వివిధ విభాగాలను వివిధ స్థాయిలలో ఏర్పాటు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయినుంచి కమిటీలను నియమించటం కనీస ఆవశ్యకం. కానీ ఆ ఏర్పాట్లేమీ జరగలేదు. పార్టీ అధినేతకు ఎంత కరిష్మా ఉన్నాగానీ ఒక వ్యవస్థీకృత నిర్మాణం లేకపోతే ఆ పార్టీ ముందుకు సాగలేదు. ప్రస్తుతం కంటెంట్ రైటర్స్, ఎనలిస్టులు, స్పీకర్ పదవులకు అని జిల్లాలలో ఎంపిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి వీరి పాత్ర ఏమిటనేది, వీరినే కార్యకర్తలుగా పరిగణిస్తున్నారా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. వీరే కార్యకర్తలు, శ్రేణులు అయితే మరి పార్టీలో చేరాలనే అభిమానం, ఆకాంక్ష, తపన ఉండికూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనివారు జనసేనకు పనికిరారని భావించటం సరికాదు కదా!

2. ద్వితీయశ్రేణి నాయకత్వం: జనసేనలో మరో ప్రధానలోపం ద్వితీయశ్రేణి నాయకత్వం లేకపోవటం. దాంతో పార్టీ ఏ విషయంపైనైనా స్పందించాల్సివచ్చినా అది పవన్ దృష్టికి వెళ్ళి ఆయన స్పందించే సమయానికి ఆ విషయాన్ని అందరూ మరిచిపోతున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన కత్తిమహేష్ వ్యవహారం. నిష్పాక్షిక విశ్లేషకుడినని చెప్పుకునే ఈ వైసీపీ సానుభూతిపరుడు(అవును, ఆయన ఈ విషయాన్ని స్వయంగా ఒక యూట్యూబ్  ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు) పవన్ పై కొన్ని పరుషవ్యాఖ్యలు చేశాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో, బయట కత్తిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.... యాగీ చేశారు. ఇది పెద్ద రాద్ధాంతం అయింది. ఇంత జరుగుతున్నా పవన్ గానీ, పార్టీ గానీ స్పందించకపోవటంతో తటస్థవాదులు కూడా పవన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పార్టీలోనైనా ప్రతి చిన్నవిషయాన్నీ పార్టీ అధినేతగానీ, కోర్ కమిటీగానీ చర్చించాల్సిన అవసరంరాకూడదు. ఇలాంటి చిన్న విషయాలను, పార్టీపై ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని, ప్రత్యర్థి పార్టీలనుంచి వచ్చే కోవర్టులను హేండిల్ చేయటానికి ద్వితీయశ్రేణి నాయకత్వం అవసరమవుతుంది. జనసేనలో దీని జాడే లేదు.

3. స్పష్టమైన కార్యాచరణ: ఏ పార్టీ ప్రారంభించినా ఒక ప్రధాన లక్ష్యం, నినాదంతో ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీని నాడు రామారావు అవినీతి కాంగ్రెస్ పాలనను అంతమొందించటమే లక్ష్యంగా, ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రసమితిని చంద్రశేఖరరావు స్వీయపరిపాలన అనే లక్ష్యం, నిధులు-నీళ్ళు-నియామకాలు అనే నినాదంతో మొదలుపెట్టారు. ప్రశ్నించటం అనే నినాదంతో వచ్చిన పవన్ తన అంతిమలక్ష్యంకూడా స్పష్టంగా చెప్పాలి. ఆయన తన మిషన్ స్టేట్ మెంట్, విజన్ స్టేట్ మెంట్ ఇప్పటికే ప్రకటించి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఆ ప్రకటనలు చేసిఉంటే పార్టీలోకి ప్రవేశించేవారికి కూడా స్పష్టత ఉంటుంది. అందులోనూ రాజకీయ పార్టీ అన్నాక రకరకాల ఎజెండాలతో వచ్చేవారు ఉంటారు. పవన్ గెలిస్తే అధికారాన్ని అనుభవించొచ్చని కొందరు, రెండు ప్రధానపార్టీలలోనూ ఇమడలేక, స్థానంలేక, టిక్కెట్లు దక్కక ఈ పార్టీని ప్రత్యామ్నాయ వేదికగా పరిగణించి వచ్చేవారు(వీరే ఎక్కువ), పవన్ పిలుపునిచ్చాడని ఎల్లలు లేని అభిమానంతో ఆస్తులు పణంగా పెట్టి వచ్చేవారు… అందరూ వస్తారు. అందుచేత పవన్ ఈ విషయంలో ముందే స్పష్టత ఇస్తే తాలు(ఊక)ను నివారించినట్లువుతుంది, భిన్నమైన ప్రయోజనాలను ఆశించి వచ్చేవారికి ఆశాభంగంకూడా కలగదు.

 

మరోవైపు అన్ని ప్రధాన పార్టీలూ ఆకర్ష్ రాజకీయాలను నడుపుతున్న పరిస్థితులలో నిస్సిగ్గుగా పదవులకోసం ప్రయోజనాలకోసం నాయకులు జంప్ చేస్తున్న తరుణంలో జనసేనకు పదో, ఇరవయ్యో స్థానాలు లభిస్తే అధికారంలోకొచ్చే పార్టీబారినుంచి ఆ పదో-ఇరవయ్యో ఎమ్మెల్యేలను కాపాడుకోవటం పెద్ద సమస్యగా మారక తప్పదు. మరి అలాంటి పరిస్థితులకు జనసేనాని సిద్ధమైఉన్నారో లేదో తెలియదు.

 

4. సొంత మీడియా: ఒక రాజకీయపార్టీకి సొంతమీడియా అనేది లేకపోవటం… అదీ కమ్యూనికేషనే కీలకమైన ప్రస్తుత కాలపరిస్థితులలో… ఆత్మహత్యాసదృశమనే విషయం అందరికంటే పవన్ కే ఎక్కువ తెలిసుండాలి. ఎందుకంటే ప్రజారాజ్యం అనే ప్రయోగం విఫలమవటానికి ప్రధాన కారణాలలో సొంత మీడియా లేకపోవటం అనేది ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళటానికి తప్పనిసరిగా పార్టీ పత్రికగానీ, ఛానల్ గానీ కావాలి.

 

దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు ప్రధాన పార్టీలూ అన్నివనరులూ పుష్కలంగా ఉన్న రెండు మత్తగజాలలాంటివి. అలాంటి రెండు పార్టీలను, వారి దాడులను, విమర్శలను, దుష్ర్పచారాలను తిప్పికొట్టాలంటే సొంత మీడియా అనేది అత్యావశ్యకం. మరి జనసేన ఈ విషయంలో ఏమాలోచిస్తుందో ఇప్పటివరకూ తెలియదు.

 

5. అధినేత వ్యవహారశైలి: తొలినాళ్ళలో పవన్ ప్రసంగాలు ఊహాప్రపంచంలో(utopian world) ఉంటున్నట్లు అనిపించినప్పటికీ, తర్వాత తర్వాత ఆయన ప్రసంగాలలో వాస్తవికత, ఆచరణీయత, పరిణతి కనబడుతున్నాయని చెప్పాలి. మొదట్లో కనిపించిన పేసివ్ ఏగ్రెసివ్ నెస్ కూడా తగ్గి, తెలుగుదేశంతో సహా ప్రత్యర్థుల తప్పిదాలను ఇటీవల నేరుగానే ఎత్తిచూపుతున్నారు. అయితే, పవన్ పై ప్రధానంగా వినిపించే విమర్శలు - అస్పష్టత, నిలకడలేమి(inconsistency). ఆయనకు ఏ కార్యక్రమమైనా, భావన అయినా మొదట్లో ఉన్నంత తీవ్రమైన తపన క్రమక్రమేణా క్షీణిస్తూ ఉంటుందనేది మరో ప్రధాన విమర్శ. దీనికి తార్కాణంగా 'కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్'ను ఉదహరిస్తుంటారు. జనసేన విషయంలో ఆ తపనను ఆయన సస్టెయిన్ చేస్తారా, లేదా అనేది వేచి చూడాలి. ఇక పవన్ చేసే కొన్నికొన్ని ప్రకటనలు అపరిపక్వంగా ఉంటాయి. ఉదాహరణకు-మెయిన్ స్ట్రీమ్ మీడియాను తాను అనుసరించనని ఇటీవల(కత్తి మహేష్ వివాదం సందర్భంగా) చెప్పటం. వివిధ రంగాల పోకడలను, ప్రజల నాడిని తెలుసుకోకుండా పురోగతి సాధించలేమన్న విషయం సినిమారంగంలోని వారందరికీ తెలుసు. అది రాజకీయాలకూ వర్తిస్తుంది. మరి సినీ రంగంనుంచి వచ్చిన పవన్ కు ఈ విషయం ఎందుకు అర్థంకావటంలేదో తెలియదు.

ఏది ఏమైనా, అత్యున్నతస్థాయిలో ఉన్న కెరీర్ ను తృణప్రాయంగా వదులుకుని, నిస్వార్థంతో, ప్రజాసేవ అనే ఒక మంచి ఆశయంతో రాజకీయాలలోకి రావటం అనేది అందరూ చేయలేరు... నూటికో, కోటికో ఒక్కరు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ సంకల్పం ఒక్కటే సరిపోదు… స్పష్టత, దుర్భేద్యమైన కార్యాచరణ(fool-proof action plan) కూడా ఉండాలి. పవన్ ఉద్దేశ్యం, సంకల్పం మంచిదే అయినప్పటికీ, కార్యాచరణ సరిగా లేకపోతే ఆ సంకల్పం నెరవేరదు. మరోవైపు - ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోతోపాటు, ఆ చిత్ర యూనిట్ లోని వారందరిపైన ప్రభావం ఉన్నట్లే, రాజకీయపార్టీ విఫలమైతే అధినేత ఒక్కడిపైనే కాక అనేకమందిపై ప్రభావం ఉంటుందనే విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్! నీకున్న కరిష్మా కారణంగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కారణంగా లక్షలసంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు జనసేన అనే ప్రయోగంలో పాలుపంచుకుంటున్నారు. నువ్వు ఏమాత్రం తప్పటడుగులు వేసినా దాని పర్యవసనాలు నువ్వు ఒక్కడివే కాదు, లక్షలమంది అనుభవిస్తారని గుర్తుపెట్టుకో. గుడ్ లక్!

 

(*శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ , ఫోన్: 99482 93346)

click me!