‘ఫేక్’ న్యూస్‌పై ‘నిఘా’: మిలియన్ ఎఫ్‌బీ అకౌంట్లు ‘డిలీట్’

By rajesh y  |  First Published Apr 9, 2019, 11:14 AM IST

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 40 బృందాలుగా విడిపోయి 30 వేల మంది సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వరిస్తున్నారు. ‘ఫేక్’ న్యూస్‌ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు తొలగించేస్తున్నారు. 
 


న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌.. ఈసారి భారత్‌లో జరగనున్న ఎన్నికలకు మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే భారీగా బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ 10 లక్షల నకిలీ ఖాతాలను తొలగిస్తోంది. 

ఈ నకిలీ వార్తలు, పోస్టులు భారత ఎన్నికల మీద ప్రభావం చూపకుండా మూడు నెలలుగా పనిచేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. సైబర్‌ సెక్యూరిటీ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అనుభవజ్ఞులైన సుమారు 30 వేల మందికిపైగా సిబ్బంది, 40 బృందాలు మెన్లో పార్క్‌, ఇండియా, డబ్లిన్‌, సింగపూర్‌లలో పని చేస్తున్నారు. 

Latest Videos

undefined

వీడియోలు, ఆడియోలు, ఇతర పోస్టుల్లో విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలు ఉన్నా ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉన్నా, నకిలీ వార్తలపైన వేటు వేస్తున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే వారి ఖాతాలను తొలగిస్తున్నారు.

వీరు ప్రతి రోజూ 24 గంటల పాటు పనిచేస్తారు. ఇటీవల కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న 687 నకిలీ పేజీలను తొలగించడం కూడా ఇందులో భాగమే. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో యాప్‌’ తయారీ సంస్థ సిల్వర్‌ టచ్‌కు చెందిన కొన్ని నకిలీ పేజీలను కూడా తొలగించినట్లు కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌ తెలిపింది.

నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఏడాది మార్చిలో పార్లమెంటరీ కమిటీ ఫేస్‌బుక్‌ను కోరింది. వీటి ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. కేవలం ఫేస్‌బుక్‌కి మాత్రమే కాక ఇతర సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌కూ ఈ సూచనలు చేసింది.

ఫేస్‌బుక్‌ ఇంజినీరింగ్‌ విభాగం మేనేజర్‌ కౌశిక్‌ అయ్యర్‌  మాట్లాడుతూ..‘ భారత్‌లో దేశవ్యాప్తంగా మా సిబ్బంది నకిలీ వార్తలపై ద్రుష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నియమ నిబంధనలకు నకిలీ వార్తలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 18నెలల క్రితమే దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దీని వల్ల ప్రజాస్వామ్యానికి హాని కలిగించే వార్తలేవి, నిజమైన వార్తలేవనేది త్వరగా విశ్లేషణ చేయవచ్చు. సెక్యూరిటీ కారణాల వల్ల దీని పేరు చెప్పలేకపోతున్నాం’ అని తెలిపారు.

click me!