డ్రగ్స్‌ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని పొడిచి చంపాడు.. ఢిల్లీలో దుర్ఘటన

By Mahesh KFirst Published Feb 2, 2023, 12:47 PM IST
Highlights

ఢిల్లీలో ఓ యువకుడు డ్రగ్స్ కొనుక్కోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా.. అతను నిరాకరించాడు. దీంతో తండ్రిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తండ్రి మరణించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: డ్రగ్స్‌కు బానిసైతే.. అది ఎంతటి అఘాయిత్యాన్ని అయినా వారితో చేయిస్తుంది. దీనికి నిదర్శనంగా దేశ రాజధానిలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ దుండగుడు ఏకంగా తండ్రినే కత్తితో దాడి చేసి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వాయవ్య ఢిల్లీలోని సుభాష్ ప్లేస్‌లో ఈ ఘటన జరిగినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

శకుర్‌పూర్ గ్రామంలో సురేశ్ కుమార్, ఆయన కుమారుడు అజయ్‌లు నివాసం ఉంటున్నారు. అజయ్ కుమార్‌కు తండ్రికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ పెద్దగా మారడంతో విషయం పోలీసులకు చేరింది. పోలీసులు వంెటనే సుభాష్ ప్లేస్‌కు చేరుకున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

స్పాట్‌కు చేరగానే సురేశ్ కుమార్ కత్తి గాయాలు, ఒరిపిడిలతో నెత్తుటి మరకలతో కనిపించాడు. ఒక చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. సురేశ్ కుమార్‌ను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్టు పోలీసులు తెలిపినట్టు పోలీసులు వివరించారు.

Also Read: నైట్ క్లబ్‌ లో అర్ధ రాత్రి పోలీసుల రైడ్.. అదుపులోకి సుమారు 300 మంది.. ఏం జరిగిందంటే?

నార్త్‌వెస్ట్ ఢిల్లీ డీసీపీ ఉశా రంగ్నాని ఈ ఘటనపై మాట్లాడారు. ఈ ఘటనలో దర్యాప్తు చేస్తుండగా డబ్బు విషయమై బాధితుడు సురేశ్, ఆయన కొడుకు అజయ్‌ల మధ్య గొడవ జరిగినట్టు తేలిందని వివరించారు. వీరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ కొనుక్కోవడానికి తండ్రిని డబ్బు అడగ్గా.. అతను తిరస్కరించినట్టు తెలిసిందని చెప్పారు. దీంతో అజయ్.. తండ్రి సురేశ్ కుమార్‌పై దాడికి తెగబడ్డాడని పేర్కొన్నారు. సంబంధిత కేసుల కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అజయ్ పై ఐపీసీలోని సెక్షన్ 302 (మర్డర్) కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఉషా రంగ్నాని తెలిపారు. అజయ్‌ను అరెస్టు చేసినట్టు వివరించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

click me!